పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చి మహాశివుడి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయాల్లో స్వామి వారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయాల వద్ద ఇలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా పెద్ద ఎత్తున ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
వేములవాడతో పాటు ఉమ్మడి జిల్లాలోని శివాలయాలు స్వామి వారి దర్శనం కోసం నాలుగు నుండి ఆరుగంటల సమయం పడుతుంది. భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. పెద్దపల్లి శివాలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి, నాళ్ళ విశ్వనాథ్, దక్షిణామూర్తి, అల్లంకి శ్రీనివాస్ తో పాటు పలువురు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని పలు శివాలయాల్లో మహాశివుడిని దర్శించుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఎంపీని ఘనంగా సత్కరించారు.
