Kishan Reddy | కేంద్ర నిధులు దుర్వినియోగం…
- చిత్తశుద్ధితో గ్రామ సీమల అభివృద్ధి
- 83 కోట్ల పేద ప్రజలకు 5 కిలోల బియ్యం
- వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు
- అప్పుల రాష్ట్రంగా మారుస్తున్న రేవంత్ ప్రభుత్వం
- ఆరు గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయి..?
- రాష్ట్రంలో కొత్తగా రైల్వే ప్రాజెక్టులు
- పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవి..?
- విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : పల్లెల అభివృద్ధి కోసం కేంద్రం నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, అది గ్రహించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయితీలకే నిధులను విడుదల చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వివేరా హోటల్లో బీజేపి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో పేద ప్రజల సంక్షేమం, పల్లె సీమల అభివృద్ధి కోసం అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడని అన్నారు.
రాష్ట్రంలో పథకాల అమలుకై రూ 12 లక్షల కోట్లతో జాతీయ రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక, వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధులు విడుదల చేశారని చెప్పారు. రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం ఉద్ధరించారని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“ఆరు గ్యారంటేలు, 420 హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకా..? అవినీతి పెంచి పోషించినందుకా..? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుకా..? ప్రభుత్వ భూములు అమ్ముతున్నందుకా..? ” అని ప్రశ్నించారు. మహిళలకు అనేక హామీలిచ్చి అమలు చేయకుండా తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రుణాలు నరేంద్ర మోదీ ఇచ్చారు తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ, పీ ఆర్ సీ అతీగతీ లేదన్నారు. బీసీలకు లక్ష కోట్ల హామీ అడ్రస్ లేదని, దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం పత్తా లేదని ధ్వజమెత్తారు. విద్యార్థుల భరోసా కార్డు ఒక్కరికీ అందలేదని విమర్శించారు. సన్న బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం కిలోకి 43 రూపాయల చొప్పున అందిస్తున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల కాలంలో 1.20 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. త్రిబుల్ ఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు..
రైల్వే అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఏకకాలంలో 42 రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణాల కోసం రాష్ట్రానికి రూ 35 వేల కోట్ల నిధులు వెచ్చించిందని తెలిపారు.
వరంగల్ లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రూ. 600 కోట్లు, ఎంఎంటీఎస్ రెండు దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు విస్తరణ పనులకు రూ. 11 వందల కోట్లు విడుదల చేసినట్లు త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం రూ. 720 కోట్లు, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మాదిరిగా దేశంలో రైల్వే స్టేషన్లు ఉండబోతున్నాయని అన్నారు..
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు..
వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తుందని అన్నారు. యూరియా బస్త పై రూ. 13వందల సబ్సిడీ ఇస్తూ రైతుల కోసం పనిచేస్తున్నామన్నారు.
2014 లో ధాన్యం కొనుగోళ్ల కోసం రూ 3600 కోట్లు కేటాయిస్తే నేడు రూ 26 వేల ఇస్తున్నామని, పత్తి కొనుగోలుకు రూ. 60 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. వన్ నేషన్ వన్ గ్రిడ్ లో భాగంగా విద్యుత్ కోతలులేని నూతన భారత వనిని ప్రధానమంత్రి నిర్మించారని చెప్పారు.
వరంగల్ లో టెక్స్టైల్ పార్కు, జహీరాబాద్ లో స్పెషల్ ఎకానమీ జోన్, భువనగిరి ఫోర్ట్ కు నిధులు మంజూరు చేసామన్నారు. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎన్ టీ పీ సి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంలేదని, ప్రైవేటు వ్యక్తులకోసం మొగ్గు చూపుతుందని ఆరోపించారు. త్వరలో బీబీనగర్ ఎయిమ్స్ ను పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు.
అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసిఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ముందు 2014 లో మిగులు బడ్జెట్లో అప్పగిస్తే 10 సంవత్సరాలు కేసీఆర్, రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించాలన్న, పథకాలు అమలు చేయాలన్న, పదవి విరమణ పొందిన ఉద్యోగుల బెన్ఫిట్స్ ఇవ్వాలన్న భూములను అమ్మాల్సిన పరిస్థితి నేడు దాపురించిందని తెలిపారు. ప్రభుత్వ పాలన కొనసాగేందుకు అప్పుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంపర్లాడే స్థితికి పోయిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల జరుగుతున్న పట్టింపు లేదన్నారు. ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ కట్ట వ్యతిరేకంగా పాల్పడిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ సమావేశంలో బీజేపీ, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్, ఆ పార్టీ రాష్ట్ర నేతలు బూర నరసయ్య గౌడ్, వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేందర్ గుప్తా, శ్రీ వర్ధన్ రెడ్డి, దాసరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

