TBGKS| సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణకు
- టీబీజీకేఎస్ నిరహార దీక్ష
- నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే దశల వారి ఉద్యమం
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- జిఎం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన
TBGKS| గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ కార్మికుల మెడికల్ (Medical) బోర్డు నిర్వహణలో యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆందోళన నిర్వహించింది. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షను చేపట్టింది. గడిచిన 9నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా జరుగుతున్న అలసత్వంపై వందలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దీక్ష సందర్భంగా మండిపడింది. నిరాహార దీక్షను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
ఈసందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… సింగరేణి (Singareni) కార్మిక కుటుంబాలకు అన్యాయం చేసేందుకే యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించలేకపోతుందని ఆరోపించారు. నెలల తరబడిగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడానికి అసలు కారణాలు చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రెండుసార్లు మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు పరిశ్రమలో కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం చేస్తున్న కుట్రలో భాగంగా అనుమానాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు.
మెడికల్ బోర్డు (medical Board) నిర్వహణ కోసం వందలాది మంది కార్మికులు… వారసులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అనవసరమైన సాకులతో మెడికల్ బోర్డు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. మెడికల్ బోర్డు నిర్వహించేంతవరకు బొగ్గు గని కార్మికుల పక్షాన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముందుండి పోరాటం చేస్తుందని… సింగరేణి వ్యాప్తంగా దశల వారి ఉద్యమాలకు టీబీజీకేఎస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసు రామ్మూర్తి, ఆయిలి శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, పార్లపల్లి రవి, జావిద్ భాష, గోపు ఐలయ్య యాదవ్, పోలాడి శ్రీనివాసరావు, కౌశిక్ హరి, హరీష్ రెడ్డి తోపాటు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.


