2,500 Drones | డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి
2,500 Drones | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : డ్రోన్ షోలు కాదు.. విద్యార్థుల డొక్కలు నింపే విధానాలు తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ(New Democracy) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవర్ధన్ అన్నారు. పీడీఎస్‌యూ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభ శుక్రవారం టీపీటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన గోవర్ధన్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని అసమానతలను తొలగించే శక్తి విద్యలోనే ఉందని పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారికి విద్య అందించినప్పుడే బడుగు–బలహీన వర్గాల విద్యార్థులు అవకాశాలు సొంతం చేసుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని ఆయన అన్నారు. పాలకులు అవలంబిస్తున్న కార్పొరేట్(Corporate) అనుకూల, మతోన్మాద ప్రోత్సాహక విధానాల కారణంగా విద్య ఇప్పటికీ కొద్ది వర్గాలకే పరిమితమైందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యను పూర్తిగా కార్పొరేటీకరించడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుతో యూనివర్సిటీలు, కళాశాలల్లో కోర్స్ ఫీజులు(Course Fees), పరీక్ష ఫీజులు భారీగా పెరిగి నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. యూజీసీ కొత్త నిబంధనలు వర్సిటీల స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి వంటి వీరుల ఆశయాలతో విద్యార్థులు ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్లోబల్ సమ్మిట్(Global Summit) పేరుతో 2,500 డ్రోన్లతో(2,500 Drones) గిన్నిస్ రికార్డు పేరున రాజకీయం చేస్తూ, మరోవైపు విద్యార్థులకు ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వాయిదా వేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేష్, జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్, ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా నాయకులు శ్రీకాంత్, ఎండీ ఇస్మాయిల్, జస్విక, పూజ, దుర్గ ప్రసాద్, గోపాల్, రాకేష్, అశ్విని, జశ్విత్, వినోద్, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

