దేదీప్యమానంగా కనక దుర్గమ్మ కలశ జ్యోతి ఊరేగింపు…

ఆంధ్రప్రభ, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నియమబద్ధ దీక్షతో పూజించి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు కాంచీ కామకోటి పీఠాధిపతుల ఆదేశాల మేరకు 1981లో ప్రారంభమైన భవానీ దీక్షలతోపాటు కలశ జ్యోతి ఊరేగింపు సంప్రదాయం కొనసాగుతోంది. గురువారం జరిగిన జ్యోతి ఊరేగింపు 44వదిగా ఆలయ పండితులు ప్రకటించారు.

ఆచారానుసారం సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిరోహింపజేసి జ్యోతి ఊరేగింపును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకరబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోలాటాలు, నృత్యాలు వంటి సంప్రదాయ కళాప్రదర్శనల నడుమ, వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా వచ్చిన భవానీ భక్తులు కలశ జ్యోతులను చేత పట్టుకుని జై జై దుర్గా నినాదాలతో ముందుకు సాగారు. భక్తులు తీసుకువచ్చిన జ్యోతులను ఆలయ ప్రాంగణంలో ఉంచి, భవానీ భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.

Leave a Reply