అవుకు రూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రప్రభ ) : నంద్యాల జిల్లా అవుకు మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో భూ సమగ్ర సర్వేలో భాగంగా భూములను సర్వే చేసేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళుతున్న ఉప్పలపాడుకు చెందిన గ్రామ సేవకుడు తలారి రాముడు (56)విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం… తలారి రాముడు ఉప్పలపాడు గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి గ్రామ సేవకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం భూసర్వే చేసేందుకు వెళ్తున్న సమయంలో అతని భుజంపై ఉన్న భూములను కొలత కొలిచే ఇనుప పరికరం పొలంలో కిందికి వేలాడిన విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. వెంటనే గమనించిన రెవెన్యూ అధికారులు అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం ప్రకటించారు.