Scrub typhus | వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా..

Scrub typhus | వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా..
- చిత్తూరు జిల్లాలో భారీగా స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు
- అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
Scrub typhus, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతూ ప్రజారోగ్య విభాగాన్ని మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా ప్రభావితమవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 379 కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కేసులు విస్తరించి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
స్క్రబ్ టైఫస్ ప్రధానంగా అడవి ప్రాంతాలు, పొదలు, గడ్డి సమృద్ధిగా ఉన్న ప్రదేశాలలో ఉండే చిగ్గర్ అని పిలువబడే సూక్ష్మ కీటకం ద్వారా వ్యాపిస్తుంది. ఈ కీటకం మనిషిని కుట్టినప్పుడు దాని లాలాజలంలో ఉండే ఒరియెంటియా సుట్సుగాముషి అనే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధి మనిషి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించదు. అధిక తేమ, వర్షాకాలం, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలే ఈ వ్యాధి పెరుగుదలకు ప్రధాన వేదికగా మారుతున్నాయి. ఈ వ్యాధికి గమనించదగ్గ లక్షణం ఎస్చార్ కుట్టిన ప్రదేశంలో చిన్న ఎరుపు మచ్చగా మొదలై, తరువాత నల్లగా మారే ప్రత్యేక లక్షణం. దీనితో పాటు అధిక జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు, వికారం, గ్రంధుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం తగ్గకపోవడం, శరీరం బలహీనపడటం వంటి లక్షణాలు బయటపడితే వెంటనే వైద్య సాయం పొందడం అత్యంత అవసరం.
చిత్తూరు (Chittoor) జిల్లాలో నమోదవుతున్న కేసుల పెరుగుదల ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. వ్యవసాయదారులు, తోటల పని వారు, అడవుల్లో పని చేసేవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉండటంతో గడ్డి, పొదలు ఉన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించడం అవసరం. ఇంటి పరిసరాల్లో పొదలు పెరిగిపోవడం, గడ్డి దట్టంగా ఉండటం, ఎలుకల రాకపోకల వల్ల చిగ్గర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకల నియంత్రణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకం. సకాలంలో చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. న్యూమోనియా, మెనింజిటిస్, మయోకార్డైటిస్, రెనల్ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వెలుగుచూడవచ్చు. చికిత్స ఆలస్యం చేస్తే దుష్పరిణామాలు తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ప్రజల్లో అవగాహన పెంచడం అవసరం..
ప్రస్తుత పరిస్థితుల్లో స్క్రబ్ టైఫస్‌ను పూర్తిగా నియంత్రించే మార్గం ప్రజల్లో అవగాహన కల్పించడమే సరైన మార్గం. వైద్య శాఖ ఇప్పటికే జిల్లా స్థాయి ఆసుపత్రులకు ప్రత్యేక సూచనలు ఇచ్చి, అనుమానిత కేసుల పై వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట తిరిగే చిన్నారులు, వ్యవసాయ పనులు చేసే మహిళలు, అడవుల్లో పని చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం తగ్గకపోవడం, తలతిరుగుడు, శరీరం పై మచ్చలు కనిపించడం వంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలనే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు ప్రజలు స్వచ్ఛత, వ్యక్తిగత రక్షణ చర్యలను అలవాటు చేసుకుంటే ఈ వ్యాధిని పెద్ద ఎత్తున అరికట్టవచ్చని చెబుతున్నారు. దుస్తులు శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా ధరించడం, కీటక వికర్షకాలను వినియోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, అనారోగ్యం కనిపించిన వెంటనే చికిత్స పొందడం అవసరం. ఇవి ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన నియంత్రణ మార్గాలు. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది.

