Srisailam | శ్రీశైలం దేవస్థానంలో కొత్త సేవలు…

  • భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు

నంద్యాల బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో డిసెంబరు 1 నుంచి పలు కొత్త కార్యక్రమాలు అమల్లోకి రానున్నాయని దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ధర్మకర్తల మండలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పాలకమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సోమవారం అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం ఆధునీకరణ పనులకు భూమిపూజ జరపనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గం. 10.40కు గంగాధర మండపం వద్ద నిర్మితమైన నూతన విరాళాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తరువాత పరిపాలనా కార్యాలయంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుల ఛాంబర్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఆపై అతిశీఘ్రదర్శనం, శ్రీస్వామివారి స్పర్శదర్శనం టిక్కెట్టుదారులకు ఉచిత లడ్డు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని వివరించారు.

స్పర్శదర్శనం రూ.500 టిక్కెట్‌దారులకు రెండు లడ్డు ప్రసాదాలు, అతిశీఘ్రదర్శనం టిక్కెట్టుదారులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేయబడుతాయని చెప్పారు. ఈ-టిక్కెట్టుదారుల కోసం లడ్డు ప్రసాదాల కేంద్రంలో 9వ మరియు 10వ కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక శ్రీఅమ్మవారి ఆలయ వెనుకభాగంలో మధ్యాహ్నం 12 గంటలకు కైలాస కంకణాల విక్రయ కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. భక్తులు కేవలం రూ.5 చెల్లించి ఈ కంకణాలను కొనుగోలు చేయవచ్చని కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ నూతన సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.

Leave a Reply