University | ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

University | ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
- ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి
- అధికారులు క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల అభివృద్ధి
- గోదావరి జలాలను ప్రతి ఎకరాకు చేరవేసే దిశగా అడుగులు
- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
University | ఆంధ్రప్రభ ( భద్రాద్రి కొత్తగూడెం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమగ్రంగా పరిశీలించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, రాహుల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగా శిలాఫలకం (Tablet) ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణాన్ని పర్యవేక్షించి, జరుగుతున్న పనుల పురోగతిని వివరంగా తెలుసుకున్నారు. సభాస్థలాన్ని సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారుల నుండి వివరాలు తెలుసుకొని సూచనలు ఇచ్చారు. తరువాత యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ…
అనంతరం విలేకరుల సమావేశం లో మంత్రి మాట్లాడుతూ, భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా నిలిచే విధంగా దేశంలోనే ప్రత్యేకత కలిగిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గతంలో సింగరేణి నిర్వహించిన ‘స్కూల్ ఆఫ్ మైన్స్’ అనుభవాన్ని గుర్తుచేస్తూ, జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనకు చేసిన కృషి గురించి వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం (University) లేమి నేపథ్యంలో ప్రత్యేక యూనివర్సిటీ అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వెంటనే ఆమోదం తెలపడంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని చెప్పారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో ఆరు నెలలపాటు పరిశీలించి, సాధ్యతా నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రకటించిందని మంత్రి వివరించారు.
‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’ కొత్తగూడెం
‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’గా పేరుగాంచిన కొత్తగూడెం జిల్లా (Kothagudem District) అరుదైన ఖనిజ సంపద లభ్యమయ్యే ప్రాంతంగా ఉండడంతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశమైందని మంత్రి తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన, పదేళ్లు భారత ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలను గౌరవిస్తూ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, మంత్రివర్గం మరియు అసెంబ్లీ దీనిని ఆమోదించాయని వివరించారు. జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనున్నదని అన్నారు.
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
పాల్వంచలో గడువు పూర్తి చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పర్యావరణహిత విద్యుత్ (electricity) ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అలాగే కొత్తగూడెం బైపాస్ రహదారి కోసం 420 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో హాస్టల్ సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో మంజూరు పొందనున్నట్లు తెలిపారు.
డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణానికి నిధులు
సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ (canals) నిర్మాణానికి అవసరమైన 3400 కోట్ల నిధులు ముఖ్యమంత్రి ఆమోదించినట్లు వెల్లడించారు. పినపాక, మరెళ్లపాడు, తుమ్మలచెరువు , సింగం భూపాలం, అశ్వరావుపేట, అన్నదైవంపాడు, ముకమామిడి అభివృద్ధితోపాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ భూసేకరణకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందనున్నాయని చెప్పారు.
రహదారుల నిర్మాణానికి..
కొత్తగూడెం–ఇల్లందు–హైదరాబాద్ (Hyderabad) రహదారి నిర్మాణానికి ఆమోదం లభించగా పనులు ప్రారంభించబడ్డాయని మంత్రి తెలిపారు. భద్రాచలం–మణుగూరు– ఏటూరునాగారం –చౌటాల రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ రెండు లైన్ల రహదారికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు పనులు పురోగతిగా ఉన్నాయని తెలిపారు . ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట–రాజమహేంద్రవరం–నాగపూర్–అమరావతి రహదారులు పూర్తి కానున్నాయని, ఖమ్మం–భద్రాద్రి జిల్లాల అభివృద్ధి కోసం రింగురోడ్లు కూడా ఆమోదించబడ్డాయని వివరించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో భాగంగా రహదారులు, నీటిపారుదల విద్యుత్ రంగాలలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు (Sambasivarao) మాట్లాడుతూ, పాల్వంచ పునర్జీవనంలో భాగంగా విద్యుత్ ఉపకేంద్రాల మంజూరు ప్రజల్లో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో సింగరేణి సహకారంతో నూతన బస్టాండ్ నిర్మించేందుకు, పాల్వంచలో జెన్‌కో సహకారంతో ఆధునిక బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిబింబించేలా అన్ని సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan singh) ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపన గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. డిసెంబర్ 2న జరిగే యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్ని శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని, బాధ్యతల అప్పగింపును మంత్రి కి వివరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్యమంత్రి పర్యటనకు చేపడుతున్న భద్రతా చర్యలు, ఏర్పాట్లను వివరించారు. శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ పరిశోధనల వంటి రంగాల్లో దేశస్థాయిలో విద్యార్థులకు Students ఉపయోగపడే ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో అధికారులు అత్యంత క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సజావుగా సాగేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ (Aadinarayana) మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ప్రజల ప్రతిష్ఠకు తగిన విధంగా అత్యుత్తమంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పర్యటన విజయవంతం చెయ్యాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
