PTM| 5న మెగా పీటీఎం

PTM| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను నిర్వహిస్తున్నారని.. ఈ మీటింగ్ కు మెగా పేరెంట్స్ విద్యార్థులు, తల్లితండ్రులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మెగా PTM (పేరెంట్ టీచర్స్ మీటింగ్) 3.0 అంశంపై జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 డిసెంబర్ 5వ తేదీన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు అన్నీ కలిపి మొత్తం 1468 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరగబోతుందన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను, తల్లి తండ్రులను, పూర్వ విద్యార్థులను, సామాజిక కార్యకర్తలకు, దాతలను ఆహ్వానిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు మధ్య బంధం బలపరచడమే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కోన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడే వేదిక ఈ కార్యక్రమమని తెలిపారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు.. వారి మానసిక వికాసం ఎలా ఉంది..? ఎక్కడ బలహీనంగా ఉన్నారు..? స్పోర్ట్స్ లో ఎలా ఉన్నారు..? ఏ విషయాలలో బాగా సపోర్ట్ చేస్తే పైకి వచ్చే అవకాశం ఉంటుందనే విషయాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియచేయడంతో పాటు విద్యార్థులకు సంబంధించిన విషయాలను తల్లితండ్రుల నుంచి తెలుసుకుని పరస్పరం విద్యాభివృద్ధి కి కృషి చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.

విద్యార్థుల ప్రగతి, ప్రవర్తనపై చర్చ జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందచేసి విద్యార్థుల హాజరు, మార్కులు, ఆరోగ్య వివరాలను అందచేయడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయని, కిట్ కు, సైన్స్ ప్రాజెక్టుల వంటి ఎగ్జిబిషన్ ల ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు 13 రకాల కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. డిసెంబర్ 5వ తేదిన ఉదయం 9 గంటలకు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ప్రారంభమవుతుందని.. ఈ సందర్భంగా అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలనే అంశం మీద అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించామని అన్నారు.

జిల్లాలో డ్రాప్ ఔట్ శాతం ఎక్కువగా ఉందని, వాటిని తగ్గించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి డ్రాప్ ఔట్ శాతం తగ్గించాలని సూచించమన్నారు. అదే విధంగా బాల్య వివాహాలు చేస్తే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించామన్నారు. ముఖ్యంగా 7, 8, 9 వ తరగతి విద్యార్థులకు బాల్య వివాహాల పై, సెల్ఫ్ డిఫెన్స్, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ ల మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హెడ్ మాస్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.. ప్రతి పాఠశాలల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని నోడల్ అధికారిగా నియమించాలని, ఇళ్లలో పిల్లలకు పెళ్లి విషయం గురించి చర్చిస్తున్నట్లయితే, ఆ విషయాన్ని నోడల్ అధికారికి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డ్రాప్ ఔట్ తగ్గడంతో పాటు 10 వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిసెంబర్ 5వ తేదీ నాటికి పదవ తరగతి సిలబస్ పూర్తి అవగానే 10 వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా 100 రోజుల ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, సాయంత్రం సమయంలో స్నాక్స్ ఏర్పాటు చేసి, ఎక్కువ సేపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు కలెక్టర్ ఎమ్ఈఓ, హెడ్ మాస్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ పాల్, సమగ్ర శిక్ష పీఓ లోక్ నాథ్ పాల్గొన్నారు.

Leave a Reply