Naveen Polishetty | సింగర్ గా రాణించేనా..?

Naveen Polishetty | సింగర్ గా రాణించేనా..?

Naveen Polishetty, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఇలా వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి. 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం అనగనగా ఒక రాజు సినిమాతో అలరించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజైంది. భీమవరం బల్మా.. పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.

మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా భీమవరం బల్మా.. పాట ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్‌ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. యాక్టింగ్ తో వినోదాన్ని పంచడంలోనే కాదు, సింగర్ గా పాటతో కూడా ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ కట్టిపడేసింది. ఇద్దరి జోడి చక్కగా కుదిరింది.. పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. విన్న వెంటనే.. శ్రోతల మనసు దోచుకుని, వారిచే కాలు కదిపించేలా.. ఆయన స్వరపరిచిన తీరు మెప్పించింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా బాగుంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో.. ఎంతో అందంగా, అర్థవంతంగా పాటను రచించారు. నవీన్‌ పొలిశెట్టితో కలిసి గాయని నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట.. థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి.. హీరోగా బిజీగా ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఇక నుంచి సింగర్ గా కూడా బిజీ అవుతాడేమో చూడాలి.

Leave a Reply