Pulivendula | హద్దు దాటిన అభిమానం

Pulivendula | హద్దు దాటిన అభిమానం
పులివెందుల, ఆంధ్రప్రభ : నాయకులపై అభిమానాన్ని వ్యక్తపరచడం సహజమే. కానీ ఆ అభిమానం హద్దులు దాటి ప్రమాదకర స్థాయికి చేరితే అనర్థం తప్పదు. అభిమాన నేతను చూడాలనే ఉత్సాహంతో జనసందోహంలోకి వెళ్లడం తప్పు కాదు, అయితే తమతో పాటు చిన్నపిల్లలను తీసుకెళ్లడం మాత్రం పొరపాటు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తమై తొక్కిసలాట జరిగితే… అమాయక ప్రాణాలపై ముప్పు తప్పదు.
ఇటీవలి పుష్ప–2 సినిమా విడుదల సమయంలో, అలాగే ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన వేళ… అభిమానులు హద్దులు దాటి ఉత్సాహం ప్రదర్శించడంతో అమాయక ప్రాణాలు బలి అయిన సంఘటనలు దేశం మొత్తం చూసింది. ఇదే విషయాన్ని మరల గుర్తు చేసే ఘటన పులివెందులలో చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జగన్ను చూడాలి… వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంలో, ఓ తండ్రి తన బిడ్డను భుజంపై ఎత్తుకుని, తీవ్రంగా జరుగుతున్న తోపులాట మధ్యలో జగన్ను చూడటానికి జనంలోకి దూసుకు వచ్చాడు. తోపులాటలో ఒత్తిడికి గురైన పిల్లవాడు నలిగిపోతూ.. గుక్కపెట్టి ఏడుస్తున్నా, తండ్రి మాత్రం నాయకుడిని చూసేందుకు చేసే యత్నం ఆపలేదు.
చుట్టుపక్కల వారు పిల్లాడు ఉన్నాడు జాగ్రత్త అని హెచ్చరించినా పట్టించుకోకపోవడం చూసిన వారిని విస్మయానికి గురిచేసింది. అరెరే పిల్లవాడు ఉన్నాడు జాగ్రత్త అని చెబుతున్నా ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం. చిన్నపిల్లవాడిని ఎత్తుకొని ఇలా పోవడం తప్పు అని ఇక చెప్పే వాళ్లు కరువయ్యారు.
