Telangana Reservation | రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!?

Telangana Reservation | రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!?
- మండల స్థాయిలో బీసీలకు సీట్లు తగ్గాయా…
- ఇదేమి లెక్కలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు..
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : రిజర్వేషన్ల ప్రక్రియ 50 శాతం దాటకూడదని ఆలోపే రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందునా బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 9 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామి ఇచ్చింది. దీనికి సంబంధించి కేబినెట్, అసెంబ్లిలో తీర్మానం చేసారు. బిల్లును గవర్నర్కు పంపగా ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు, బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది.
దాంతోపాటు 50 శాతం వరకే రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమయ్యారు. శని, ఆదివారాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసారు. సర్పంచులకు సంబంధించి ఆర్డీవోల వద్ద, వార్డుమెంబర్లకు గాను ఎంపీడీవోల వద్ద రిజర్వేషన్లు ఖరారు చేసారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేసారు. నెలఖరు వరకు షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది…. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 61 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో బీసీలకు 23 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేస్తే వారికి దాదాపుగా 14 గ్రామ పంచాయతీలు రిజర్వు కావాలి.
కానీ వారికి 9గ్రామ పంచాయతీల్లో మాత్రమే రిజర్వు చేసారు. మంచాల మండలంలో 23 గ్రామ పంచాయ తీలున్నాయి. ఇందులో 1 గ్రామ పంచాయతీ వంద శాతం ఎస్టీలున్నారు. మిగిలిన 22 పంచాయతీల్లో 11 పంచాయతీలు జనరల్ స్థానాలకు రిజర్వు చేసారు. ఈ మండలంలో బీసీలకు కేవలం రెండు పంచాయతీలు మాత్రమే రిజర్వు చేసారు.
గ్రామ పంచాయతీల లెక్కనా బీసీలకు 6 స్థానాల్లో రిజర్వేషన్ అమలు చేయా ల్సి ఉంది. యాచారం మండలంలో 24 పంచాయతీల కు రెండు జీపీలు వందశాతం ఎస్టీలున్నారు. 22పంచాయతీల్లో బీసీలకు 6 రావల్సి ఉండగా నాలుగు పంచాయతీలతో సరిపెట్టారు.
ఇబ్రహీంప ట్నంలో 14 పంచాయతీలకు మూడు పంచాయతీల్లో మాత్రమే బీసీలకు రిజర్వు చేసారు. రంగారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు, 4668 వార్డులుండగా వికారాబాద్ జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు 5058 వార్డులు ఉన్నాయి… వార్డుమెంబర్ల రిజర్వేషన్ల విషయంలో కొంతమేర గందరగోళం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
తలకొండపల్లి మండలంలో అదే పరిస్థితి….
కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని తలకొండపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ మండలంలో 32 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 8 పంచాయతీలు వంద శాతం ఎస్టీలు ఉన్నారు. మిగిలిన 24 గ్రామ పంచాయతీల్లో 12 జీపీలు జనరల్ సీట్లుగా ప్రకటించారు.
ఎస్సీలకు 6 జీపీలు, 2 ఎస్టీలకు కేటాయించారు. బీసీలకు మాత్రం కేవలం 4 పంచాయతీలు మాత్రమే రిజర్వు చేసారు. ఈ మండలంలో బీసీలకు కొని సీట్లు తగ్గాయి…2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తలకొండపల్లి మండలంలో 6 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వు చేసారు. ఈసారి మాత్రం నాలుగు పంచాయతీలతో సరిపెట్టారు..
బీసీలకు 23 శాతం రిజర్వేషన్ చొప్పున గ్రామ పంచాయతీలు రిజర్వు చేయాల్సి ఉండగా అంత కంటే తక్కువ సీట్లు కేటాయిస్తున్నారని తలకొండపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు. బీసీ ఐకాస గుజ్జరి రాఘవేందర్ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసారు.
