TG | కాంగ్రెస్‌ అంటేనే నమ్మక ద్రోహం.. బండి సంజయ్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్‌ అంటేనే నమ్మక ద్రోహానికి నిదర్శనమని, కాంగ్రెస్‌ నయవంచనకు బీజేపీ ధర్మరక్షణకు మధ్య జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. శనివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గ పచ్చీస్‌ ప్రభారీల సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన నయవంచన, నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్‌, టీచర్లకు పిలుపునిచ్చారు.

బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్‌ సర్కార్‌పై యుద్దం ఆరంభిస్తామని ప్రకటించారు. తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కానేకాదని, ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. మంత్రిగా ఉంటూ గ్రూప్‌- 1 అభ్యర్థుల పక్షాన హైదరాబాద్‌లో ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వాల బీసీ జపం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్‌ రావు, డి.శంకర్‌, వాసాల రమేశ్‌లు పాల్గొన్నారు.

Leave a Reply