GHMC | శభాస్ కార్పొరేటర్లు!

GHMC | శభాస్ కార్పొరేటర్లు!
అవినీతి.. అక్రమాలకు దూరం!… ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : శభాస్ కార్పొరేటర్లు!.. పదేళ్ల కాలం జీహెచ్ఎంసీ లో ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి , సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు (కేటీఆర్) తమ పార్టీ కార్పొరేటర్లను ప్రశంసించారు.ఈ రోజు తెలంగాణ భవన్‌లో (At Telangana Bhavan) జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
రేపు జరుగనున్న గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై కూడా చర్చించారు. కార్పొరేటర్లకు వివిధ అంశాలపై కేటీఆర్ (KTR) మార్గదర్శనం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరపున వారికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును ప్రశంసించారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని సూచించారు.
