Congress | డీసీసీలు ఖరారు…

- వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా దారాసింగ్…
- మేడ్చల్ మల్కాజ్ గిరి వజ్రేష్ యాదవ్…
- రంగారెడ్డి జిల్లా పెండింగ్ లో..
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు ఎట్టకేలకు ఖరారు చేసారు. చాలాకాలంగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసినా చివరికి శనివారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ జాబితా ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా పెండింగ్ లోనే ఉంది. వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ నేత దారాసింగ్ పేరు ఖరారు చేసారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పగ్గాలు మేడ్చల్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్ కు అప్పగించారు.
రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోటీ తీవ్రంగా ఉండటంతో పెండింగ్ లో పెట్టారు. డీసీసీ అధ్యక్ష పదవి కీలకం కానుంది. ఏ ఐసీసీ వీరికి కీలక అధికారాలు కట్టబెట్టింది. రానున్న రోజుల్లో డీ సీసీలు కీలకం కానున్నారు. అందుకే డీసీసీ నియామకాల్లో పారదర్శకతను పాటించారు. ఢిల్లీ నుంచి దూతలను పంపి అందరి అభిప్రాయాలను తెలుసుకొని అందులో ఆరుగురి పేర్లు హస్తిన పెద్దలకు పంపించారు. అందులో ఫిల్టర్ చేసి చివరికి ముగ్గురి పేర్లు ఫైనల్ జాబితాలో చేర్చారు. మొత్తం మీద డీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారు చేసారు…
లెక్క తప్పింది…
డీసీసీ అధ్యక్షుల విషయంలో లెక్క తప్పినట్లు కనిపిస్తోంది. ప్రచారం జరిగిన వారికి కాకుండా వేరే వారిని ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి సీనియర్ నేత సుధాకర్ రెడ్డి పేరు మొదటి నుంచి ప్రచారం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుధాకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే డీసీసీ పగ్గాలు అప్పగిస్తారనే భావించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్న దారాసింగ్ కు అవకాశం దక్కింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ సమస్య తెర పైకి రావడంతో పెండింగ్ లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ లను నియమించిన హస్తిన పెద్దలు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షునీ ఎంపిక విషయంలో పెండింగ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది…


