DISEASES | కల్తీ నీళ్లతో కలకలం!

ప్రబలుతున్న అంటు వ్యాధులు
- టైఫాయిడ్, పారా టైఫాయిడ్, అంటు వ్యాధులు
- జీర్ణకోశ వ్యాధులతో ప్రజలు విలవిల
- తనిఖీలు విస్మరించిన సంబంధిత అధికారులు
DISEASES | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, పారా టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నాలుగు రోగాలు నీటికి సంబంధించినవే. మురుగునీటి నిల్వల వలన దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తే.. కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్, పారా టైఫాయిడ్ రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంతో పాటు కావలి, ఆత్మకూరు, కందుకూరు బుచ్చిరెడ్డిపాళెం, తదితర పట్టణాలను పరిశీలిస్తే డెంగ్యూతో పాటు టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. టైఫాయిడ్ ప్రధానంగా కలుషిత నీటి కారణంగానే వ్యాపిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వ్యాపారుల స్వార్థం.. ప్రజలకు ప్రాణసంకటం
జిల్లాలో అనుమతి పొందిన వాటర్ ప్లాంట్లు పదుల సంఖ్యలో ఉండగా, అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి. గతంలో ప్రజలు బోర్ల ద్వారా, పంచాయతీ, పురపాలక సంస్థల ద్వారా సరఫరా చేసిన మంచినీటినే తాగేవారు. తొలుత వాటర్ ప్యాకెట్లతో ప్రారంభమైన ఈ నీటి వినియోగం ప్రస్తుతం వాటర్ క్యాన్లు తప్పనిసరి అన్న భావనలో ప్రజలు ఉండడమే కల్తీ నీటి వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. పురపాలకాలు, పంచాయతీలు సరఫరా చేస్తున్న మంచినీరు బాగా ఉన్నప్పటికీ మానసికంగా క్యాన్ వాటర్ వాడకానికి అలవాటు పడిపోయిన ప్రజలు చేతులారా రోగాలు కొని తెచ్చుకుంటున్నారన్న వాదనలు కూడా వినవస్తున్నాయి.

ఇప్పటికీ జిల్లాలో కొన్ని వాటర్ ప్లాంట్లు సమర్థవంతంగా పనిచేస్తూ నీటిని అన్ని విధాలా శుభ్రం చేసి క్యాన్ల ద్వారా అందిస్తున్నారు. అయితే పెరిగిన క్యాన్ వాటర్ వినియోగంతో జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా అనధికారిక ఆర్వో ప్లాంటు వెలిశాయి. అధికారికంగా వాటర్ ప్లాంట్ పెట్టాలంటే మంచి సాంకేతిక నైపుణ్యాలు కలిగిన మిషనరీ వాడాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది. అయితే ఈ అనధికారిక వాటర్ ప్లాంట్లు పెద్దగా గుర్తింపు లేని మిషనరీ వాడుతూ తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో నీటిని వడకట్టడం లేదు. అంతేకాకుండా డిమాండ్ను బట్టి వాటర్ క్యాన్లలో మామూలు బోరు వాటర్ లేదా పంచాయతీ వాటర్ నింపుతూ సీల్ వేసి అమ్ముతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
తనిఖీలు పూర్తిగా మర్చిపోయిన సంబంధిత అధికారులు
సంబంధిత అధికారులు తనిఖీలకు పూర్తిగా చెల్లుచీటీ చెప్పేయడంతో అక్రమ నీటి వ్యాపారస్తులకు వరంగా మారుతోంది. దీంతో వారు యథేచ్చగా కలుషిత నీటినే క్యాన్లలో నింపుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. క్యాన్ నీటి వినియోగానికి అలవాటు పడిపోయిన ప్రజలు వారు సరఫరా చేస్తున్న నీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా.. లేదా అని పట్టించుకునే తీరికలో కూడా లేరు. మరికొంత మంది అయితే ఆ కలుషిత నీటినే కూలింగ్ క్యాన్లు ద్వారా వినియోగిస్తూ ఆరోగ్యాన్ని మరింత చెడగొట్టుకుంటు న్నారు. రాబోయే వేసవిలో నీటి వినియోగం మరింత పెరగనుండడంతో అక్రమ ఆర్వో ప్లాంట్లను తనిఖీ చేసి సరైన స్థితిలో పెట్టకపోతే ప్రజల ఆరోగ్యానికి మరింత భంగం కలిగే అవకాశం ఉంది.
ప్రజలు కూడా తాము వినయోగిస్తున్న వాటర్ క్యాన్ నీ టి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆర్వో నీటి వినియోగం అంత మంచిది కాదని శరీరానికి ఉపయోగపడే మూలకాలు అందులో ఉండవని. ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తుండగా.. బోర్ల ద్వారా, పంచాయతీలు, పురపాలకాల ద్వారా సరఫరా అవుతున్న నీటినే కాచి చల్లార్చుకుని వినియోగించుకోవడం అత్యుత్తమమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాటర్ క్యాన్ నీటి వినియోగం అధికంగా ఉన్నందున సంబంధిత అధికారులు తనిఖీలు ముమ్మర చేసి కల్తీ నీటిని అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
