- అబుల్ కలాం చిత్రపటాన్ని పాలతో శుభ్రపరిచిన ముస్లింలు
- ఆజాద్ జయంతి కార్యక్రమంలో విద్యార్ధులతో అసభ్య గీతాలకు నృత్యాలు చేయించిన ప్రిన్సిపాల్ పై ఆగ్రహం
- సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
- లేకుంటే ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరిక
ABUL KALLAM | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం పేరిట విద్యార్ధులతో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అసభ్య గీతాలకు నృత్యాలు చేయించాడు .
ఈనెల 11వ తేదీన జరిగిన ఈ ఘటనను విద్యావేత్తలు, విద్యార్ధుల తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర అభ్యంతరాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏ.ఐ.ఎస్.ఎఫ్., ఏ.ఐ.వై.ఎఫ్. ఇతర విద్యార్ధి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టి, స్కూలు ప్రినిసిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు సైతం వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ముస్లీం సంఘాల నాయకులు సమావేశం నిర్వహించుకొని పత్రికా ముఖంగా ఖండించారు.
ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్తకంఠంతో నినదించారు. ఇదిలా ఉండగా ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లీం యువకులు శుక్రవారం రోడ్డెక్కారు. మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియపరిచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాన్ని పాలతో శుభ్రపరిచి జరిగిన అవమానానికి “మౌలానా.. మాఫ్ కరో” అంటూ క్షమాపణలు కోరారు.

