Singareni | కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి :వెల్లడించిన సిఎండి బలరామ్
కాలుష్య రహిత భారత్ కోసం కీలక ఖనిజాల ఉత్పత్తి అత్యవసరం
కీలక ఖనిజాల లో భారత్ స్వయం సమృద్ధి సాధనకు కృషిచేద్దాం.
కీలక ఖనిజాల ఉత్పత్తి కోసం సింగరేణి శ్రీకారం
జాతీయస్థాయి కీలక ఖనిజాల సదస్సులో సింగరేణి సీఎండీ .బలరామ్
హైదరాబాద్ , బ్యాటరీ వాహనాలు, సోలార్ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలకఖనిజాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడుతోందని, ఈ విషయంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి ప్రభుత్వరంగ సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ లో శుక్రవారం కీలక ఖనిజాలపై క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2070 నాటికి భారత్ ను కర్బన ఉద్గార రహిత “ నెట్ జీరో ” దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది నెరవేరాలంటే దేశీయ ఖనిజ పరిశ్రమల వారు క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాల) ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కీలక ఖనిజాల పై పరిశోధన, అన్వేషణ, ఉత్పత్తి వంటి విషయాలలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, సహకారం ఎంతో అవసరం అన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం, సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగాల్లో కీలక ఖనిజాల వినియోగం ఎంతో ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఈ ఖనిజాలను విదేశాలనుంచే ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 30 రకాల కీలక ఖనిజాల జాబితాని విడుదల చేశారని, వీటిని దేశీయంగా ఉత్పత్తి చేయడం కోసం, తద్వారా స్వయం సమృద్ధి సాధనకు పరిశ్రమలు కృషి చేయాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. కనుక పెద్ద ఎత్తున పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా కీలక ఖనిజాలను దేశీయంగా ఉత్పత్తి చేయటం ఎంతో అవసరమని,ఈ సవాలను ఒక అవకాశంగా దేశీయ పరిశ్రమలు తీసుకోవలసి ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కూడా కీలక ఖనిజ పరిశ్రమ రంగంలోనికి అడుగుపెట్టడానికి సంసిద్ధమయిందని పేర్కొన్నారు. సింగరేణి ఇప్పటికే ఈ విషయంలో ముందడుగు వేసి, జనవరి మొదటి వారంలో ఐఐటి హైదరాబాద్ వారితో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి విడుదలయ్యే ఫ్లై యాష్, క్లే మరియు ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ నుండి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను వెలికి తీసే అంశంపై పరిశోధనలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు..
ఇకముందు సింగరేణి సంస్థ కేవలం బొగ్గు తవ్వకానికే పరిమితం కాకుండా కీలక ఖనిజాల అన్వేషణ మరియు ఉత్పత్తి రంగాల్లో కూడా అడుగు పెట్టనుందని తెలియజేశారు. సంస్థ తన వ్యాపార విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ కీలక ఖనిజాల విషయంలో దేశీయ స్వయంసమృద్ధికి ఇది ఉడతాభక్తిని దోహదపదుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సులో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్.మూర్తి, సింగరేణి ఈడీ కోల్ మూమెంట్, జీ.ఎం కో-ఆర్డినేషన్ ఎస్. డి.ఎం.సుభాని, క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ చైతన్యమొయి గంగూలీ, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ హామిల్టన్, సింగరేణి జీ.ఎం లు మనోహర్, నారాయణరావు, మిథానీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పోరేషన్, వేదంతా తదితర కంపెనీల అధికారులు, ఐ.ఐ.టి సంస్థల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.