GOLD| ‘గోల్డు’ గోల్ మాల్..!
- సొంత అవసరాలకు రూ. కోటి విలువైన బంగారం
- ప్రైవేటు వ్యాపారికి తరలించిన బ్యాంకు సిబ్బంది
- బ్యాంకు వద్ద ఖాతాదారుల ఆందోళన
GOLD| తణుకు, ఆంధ్రప్రభ : పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు తక్షణ రుణ సదుపాయం పొందాలంటే ముందుగా గోల్డ్ లోన్ సంస్థలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి సంస్థలు కొన్ని నమ్ముకున్న ఖాతాదారులను మోసం చేస్తున్న సంఘటనలు కొన్ని ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. ఇదే మార్గంలోకి తణుకు కేథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్బీ) కూడా తోడయింది. వివరాల్లోకి వెళితే.. తణుకు సీఎస్బీ బ్యాంకులో బంగారం తాకట్టుపై గ్రాముకు అధికమొత్తంలో ఋణ సదుపాయం కల్పించడంతో అధికసంఖ్యలో ఖాతాదారులు బంగారాన్ని తణుకు బ్రాంచ్లో తాకట్టు పెట్టుకున్నారు.
అయితే బ్యాంకుకు సంబంధించిన కొంతమంది సిబ్బంది రుణ గ్రహీతల బంగారాన్ని తణుకుకి చెందిన ఒక ప్రైవేటు వ్యక్తికి అధిక వడ్డీకి తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తణుకు సజ్జాపురానికి చెందిన మహిళ తాను తాకట్టు పెట్టుకున్న బంగారం విడిపించుకునేందుకు అప్పటికే బంగారం విడిపించిన తీసికెళ్లారని చెప్పడంతో మహిళ కంగు తిన్నారు. దీంతో బ్యాంకు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బయట బంగారం కొనుగోలు చేసి మహిళకు అందజేశారు. అయితే ఇప్పటికే సుమారు రూ. కోటి విలువ చేసే బంగారం వినియోగదారులకు తెలియకుండానే చేతులు మారినట్లు సమాచారం.
దీనిలో భాగంగా తణుకు బ్రాంచిలో బంగారాన్ని వినియోగదారులకు తెలియకుండానే తాకట్టు పెట్టిన నెలలోపే సిబ్బంది విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాది తర్వాత బంగారాన్ని విడిపించుకునేందుకు వచ్చిన వినియోగదారులు తమ బంగారం నెలలోనే విడిపించుకుపోయినట్లు సిబ్బంది తెలపడంతో అవాక్కవుతున్నారు. దీంతో వినియోగదారులు తమ బంధువులను, మీడియాను పిలిచి విషయాన్ని తెలియజేయగా బ్యాంకు శాఖాధికారి ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఉంచాలని అందుకు బదులుగా తన సొంత సొమ్ముతో బంగారాన్ని కొనుగోలు చేసి ముట్టజెప్పారు.

అయితే ఇది తెలుసుకున్న కొంతమంది వినియోగదారులు తమ బంగారం కూడా బ్యాంకులో లేదని, తమకు తెలియకుండా వేరే ప్రైవేటు బంగారు వ్యాపారి దగ్గర తనఖా పెట్టారని తెలిపారు. తేతలికి చెందిన మరొక వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం తన బంగారంతో పాటూ ఇతరులకు చెందిన సుమారు రూ. కోటి పైగా విలువ చేసే బంగారం కూడా సిబ్బంది సదరు ప్రైవేటు వ్యాపారికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై రాజమండ్రి ఉన్నతాధికారిని సంప్రదించగా ఖాతాదారులనుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.

