USAID | ఎన్నికల ప్రభావితం కోసమే అమెరికా నిధులు…స్పందించిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ – భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘‘ ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమైనవి’’గా అభివర్ణించారు. సంబంధిత అధికారులు వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
“అమెరికా కార్యకలాపాలు ,నిధులకు సంబంధించి అమెరికా పరిపాలన విడుదల చేసిన సమాచారాన్ని మేము చూశాము. ఇవి స్పష్టంగా చాలా బాధ కలిగించేవి. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనలకు దారితీసింది” అని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోందని, ఈ దశలో వివరణాత్మక బహిరంగ ప్రకటన చేయలేమని అన్నారు.