BRS | 25న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

  • బుల్డోజర్ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమం
  • ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపు

BRS | గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గంలో కొనసాగుతున్న బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 25న రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నట్లు బీఆర్ఎస్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ… నగరంలో రాత్రివేళ ఎప్పుడు ఎలాంటి కూల్చివేతలు, విధ్వంసం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంద‌ని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి ద్వారా నిర్మాణం చేస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో కూల్చివేతలకు గురైన షాపుల వారికి ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కూల్చివేతల వ్యవహారంలో రెండు పద్ధతుల ధోరణిని చందర్ వ్యతిరేకించారు. కూల్చివేతల్లో అన్యాయం జరిగిన షాపుల యజమానులకు న్యాయం చేసే విధంగా రామగుండం ఎమ్మెల్యే ఆలోచించాలన్నారు. గోదావరిఖని పట్టణంలో మైసమ్మ ఆలయాల‌ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అనుమతులతో ఆలయాన్ని కూల్చివేశారు..? దానికి కారణమైన అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు..? కారకులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని చందర్ హెచ్చరించారు.

మైసమ్మ ఆల‌యాల‌ కూల్చివేతలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న సంబంధిత కారకులపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంపై కోరుకంటి చందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు బాధితులు నగర ప్రజలు పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులకు గోపు ఐలయ్య యాదవ్, మెతుకు దేవరాజ్, అచ్చ వేణు, దొమ్మేటి వాసు, గాదం విజయ, కృష్ణవేణి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply