TG | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: రేవంత్ రెడ్డి
ఇదే తెలంగాణ ప్రభుత్వం ధ్యేయం
600 బస్సులకు ఓనర్లగా మహిళలు
మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
కోటి మంది మహిళలు మహిళా సమాఖ్యలో చేరాలి
కార్పొరేట్‌తో సమానంగా మహిళా సంఘాల వ్యాపారం
నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి
నారాయణపేట, ఆంధ్రప్రభ : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా గురుకుల హాస్టల్ ఆవరణలో నేడు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, కోటి మంది మహిళలను మహిళ సమాఖ్య సభ్యులుగా చేర్పించాలని పిలుపునిచ్చారు. ఒకరోజు కోటి మంది మహిళలతో అవుటర్ రింగ్‌రోడ్డులో ప్రదర్శన నిర్వహించి తెలంగాణ మహిళ శక్తి నిరూపిద్దామన్నారు. ఆ రోజు ఎంపీ డీకే అరుణ సహకారంతో ప్రధాన మంత్రి నరేంద్ర రెడ్డి కూడా ఆహ్వానించుదామని పేర్కొన్నారు.
600 బస్సులకు ఓనర్లగా మహిళలు
మహిళ సంఘాల ద్వారా పలు వ్యాపారాలు చేస్తున్న మహిళలకు పెట్రోల్ బంకు కూడా మంజూరు చేశామని సీఎం తెలిపారు. అలాగే ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇచ్చాలా మహిళ సంఘాలను ప్రోత్సహించినట్లు చెప్పారు. ఆర్టీసీకి ఆరు వందల బస్సులను మహిళ సంఘాలు అద్దె ప్రాతిపదికన ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అంటే ఆరు వందల బస్సులకు ఓనర్లగా మహిళలు అవుతున్నారన్నారు.
కార్పొరేట్‌తో సమానంగా మహిళ సంఘాల వ్యాపారం
కార్పొరేట్ సంస్థలతో సమానంగా మహిళ సంఘాలు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ సమీపాన ఉన్న శిల్పరామం పక్కన మూడున్నర ఎకరాల భూమిలో మహిళ సంఘాలు ఉత్పత్తులు చేయడానికి తగిన షాపింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. మీరు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ ద్యేయమన్నారు. అందుకనుగుణంగా మహిళ సంఘాలు నాణ్యతతో కూడిన ఉత్పత్తులు తయారు చేసి ఈ మార్కెట్‌కు ప్రముఖులు వచ్చేలా చేయాలన్నారు.
వెయ్యి మెగా ఓట్ల సోలర్ విద్యుత్ ఉత్పత్తి
పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల యాజమానులు నిర్వహించే సోలర్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారం ఆడబిడ్డలకు అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోలర్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం మీకే ఇస్తున్నానని చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా మీరు వ్యాపారం చేయాలని కోరారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇలా పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నానికి హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏటా ఘనంగా నిర్వహిస్తున్న పోలెపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,సీతక్క, ఎంపి డి కె అరుణ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సహ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో మంజూరైన 72,045 ఇళ్లకు నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో లాంఛనంగా శంకుస్థాపన చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు, సమాఖ్య భవనం, ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.