27న రెండవ ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన

  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు

గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండవ ప్రాకార నిర్మాణానికి ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ కలిసి బుధవారం పరిశీలించారు.

కార్యక్రమ వివరాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలను అధికారులకు అందించారు. రెండవ ప్రాకారానికి భూమి పూజ నిర్వహించడానికి నవంబర్ 27వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి 10:50 గంటల వరకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన అనంతరం సీఎం చంద్రబాబు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారని.. ఆ తర్వాత బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని వివరించారు.

ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ముఖ్యమంత్రి పర్యటన పక్కాగా, సజావుగా జరిగేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ముఖ్యంగా బహిరంగ సభ వేదిక, బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు. పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, డీ.ఎస్.పీ మురళి కృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాస రెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ ఎ.శివ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ టి.వి.సత్యనారాయణ, ఇతర టీటీడీ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply