Sangareddy | ఛీ..! మీరు మనుషులేనా?
చాక్లెట్ ఆశ చూపి.. ఎనిమిది ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం
ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అమానుషం
చితకబాదిన స్థానికులు.. పోలీసులకు అప్పగింత
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి సంగారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వెళ్లిన ఇద్దరు యువకులు పాపకు చాక్లెట్ ఇస్తామని చెప్పి.. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. పాప కనిపించకపోయేసరికి వెతుకుతుండగా… తీవ్ర రక్తస్రావంతో దగ్గర్లోని పొదల వద్ద కనిపించింది. వెంటనే బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
నిందితులను చితక బాదిన గ్రామస్థులు
సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి. వాటి ప్రకారం ఇద్దరి నిందితులను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట కాలనీ వాసుల ఆందోళన చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనని విరమింపజేశారు.