12 quintals | రైతులను ఇబ్బందులు పెడితే సహించం

12 quintals | రైతులను ఇబ్బందులు పెడితే సహించం
- సీసీఐ నిబంధనలు మార్చాలి..
- సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Medak | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను విక్రయిద్దామంటే సీసీఐ(CCI) నిబంధనలు అడ్డు వస్తున్నాయని, వాటిని వెంటనే సవరించి పత్తి కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(Chinta Prabhakar) అన్నారు. ఈ రోజు సంగారెడ్డి లో ఆయన మాట్లాడుతూ రైతులను ఇబ్బందులు పెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఏ నిర్ణయాలను స్వాగతించేది లేదని, అవసమైతే రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రైతులను ఇబ్బందులు పెడితే సహించమని చెప్పారు. పత్తి కొనుగోలుకు ముందు స్లాట్ బుకింగ్ నిబంధనను వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు.
మూడు జిన్నింగ్ మిల్లులు(Ginning Mills) ఒకే సారి ప్రారంభించి పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నాయని, రైతులకు నష్టం కలిగించే నిబంధనలు ఎత్తివేసి రైతులకు మేలు చేసే నిబంధనలు అమలు చేయాలని కోరారు.
సాగు చేసిన కాలం మొదలు అక్టోబర్(October) వరకు వర్షాలు, వరదలు కారణంగా తెగుళ్లు, కాయ నల్లగామారడం, పత్తి కారిపోవడం లాంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారన్నారు. పంటను కాపాడుకోవడానికి రైతులు సర్వం ధారపోశారని చెప్పారు. యూరియా(Urea) ధర పెరిగినా వెనుకాడలేదని, దిగుబడులు వచ్చేసరికి సరికొత్త సమస్యలు పత్తిరైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని పేర్కొన్నారు. ..
గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల(12 quintals) వరకు కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేదని, దీనిని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం పెరిగిందని ,8 నుంచి 12 శాతంలోపు తేమ ఉంటేనే పత్తి కొనుగోళ్లు చేపడుతామని సీసీఐ నిబంధనలు పెట్టడం సరికాదని, ఇది ముమ్మాటికీ దళారులు, ప్రైవేట్ వ్యాపారుల(brokers, private traders)కు లాభం చేకూర్చేందుకేనని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు.
పత్తిలో తేమ శాతం 20 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి అమ్మాలనుకునే రైతులను మరింత ఇబ్బంది పెట్టేందుకే కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App) అనే కొత్త నిబంధన తీసుకురావడంతో రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని, ఈ యాప్ వినియోగంపై రైతులకు ఏ మాత్రం అవగాహన లేదని ఆయన అన్నారు. పత్తి అమ్ముకునేందుకు రైతులు వేలాది రూపాయలు వాహనాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. రైతులకు మేలు చేసే నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
