TG | ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
- నిందితుని స్థిరచరాస్థులపై ఏసీబీ ఆరా..!
హైదరాబాద్,ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్, ఎఫ్‌ఏసీజనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ ఏసీబీ వలకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే…
మాసబ్ ట్యాంక్‌లో ఉన్న ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్‌సీసీడీసీఎల్)లో వివిధ నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు రూ.33,32,350ల బిల్లులు మంజూరయ్యాయి. అయితే బిల్లు మొత్తాలను చెల్లించేందుకు ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్, ఎఫ్‌ఏసీజనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్ రూ.1.33లక్షలు డిమాండ్ చేశారు.
పనులు నిర్మాణంలో నష్టాలు వచ్చాయని, రూ.1.33 లక్షలు ఇవ్వలేనని సదరు కాంట్రాక్టర్ ఆనంద్‌కుమార్‌కు తెలిపాడు. అయితే రూ.33,32,350లు మంజూరు చెయ్యాలంటే లంచం ఇవ్వాల్సిందేనని అధికారి తేల్చిచెప్పడంతో వెంటనే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో గురువారం రూ.లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్‌ను అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఆనంద్ కుమార్ పట్టుబడటంతో ఆ శాఖలోని ఇతర అధికారులు అప్రమత్తయ్యారు. మసబ్ ట్యాంకులోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఏసీబీకి పట్టుబడిన నిందితుడు బి.ఆనంద్ కుమార్ స్థిరచరాస్థులపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఆనంద్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు.