TEMPLE | ఇంద్రకీలాద్రిపై జనసంద్రం

కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

  • వారాంతపు సెలవుతో పెరిగిన రద్దీ
  • ముందస్తు ఏర్పాట్లు చేసిన అధికారులు
  • అధికారులు సిబ్బందికి ప్రత్యేక విధులు
  • అంతరాలయ దర్శనం రద్దు
  • బంగారు వాకిలి ద్వారానే..
  • వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలపై ఆంక్షలు
  • సామాన్య భక్తులకే పెద్దపేట
  • శీఘ్ర దర్శనం కోసం ఏర్పాట్లు
  • క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాలలో పర్యటించిన ఈఓ
  • ఏర్పాట్లపై భక్తుల నుంచి సంతృప్తి

TEMPLE | ఇంద్రకీలాద్రిపై జనసంద్రంఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వారాంతపు సెలవులకు తోడు కార్తీక మాస చివరి రోజులతో ఇంద్రకీలాద్రి జన సముద్రాన్ని తలపిస్తోంది. కనకదుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తుల రాకతో ఇంద్రగిరులు భక్తులతో పోటీ ఎత్తుతున్నాయి. గంట గంటకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం సాధ్యమైంది. దేవస్థానం అధికారులు సిబ్బందికి ఈవో ప్రత్యేక విధులు కేటాయించడంతో ఆయా ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించిన వీరు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు సాఫీగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసిన అధికారులు, ప్రొటోకాల్ వీఐపీ దర్శనాలపై ఆంక్షలు విధించారు. అందరినీ బంగారు వాకిలి ద్వారానే అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు సామాన్యులకు పెద్దపీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

క్షేత్రస్థాయిలో ఈవో ప‌ర్య‌వేక్ష‌ణ‌…
అసలే ఆదివారం ఆపై కార్తీకమాసం కావడంతో భక్తుల రద్దీ ని ముందుగానే అంచనా వేసిన ఆలయ అధికారులు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడి ఈవో శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భక్తుల అభిప్రాయాలను తీసుకుంటూ ఇబ్బందులపై సత్వర ఆదేశాలు ఇస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం టోల్గేట్ దగ్గర నుండి మొదలు ఘాట్ రోడ్డు ఓమ్ టర్నింగ్, చిన రాజా గోపురం, ప్రధాన ఆలయంతో పాటు మహా మండపం వంటి ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ప్రారంభించారు. క్రమంగా వాహన రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై అవగాహనాలకు ఆంక్షలు విధించారు. అన్ని వాహనాలను ఓమ్ టర్నింగ్ వరకే అనుమతించిన అధికారులు అక్కడ నుండి కాలిబాటన అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లకు వెళ్లే వెళ్లే విధంగా చర్యలు ప్రారంభించారు. అన్ని ప్రాంతాలలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈవో అవసరమైన సూచనలు సలహాలు అందిస్తూ వచ్చారు.

సిబ్బందికి ప్రత్యేక విధులు
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి ఆదివారం భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో దేవస్థానంలోని అధికారులు సిబ్బందికి ఈవో శీనా నాయక్ ప్రత్యేక విధులను కేటాయించారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు వాహనాల రద్దీ నియంత్రణ సజావుగా క్యూ లైన్ లో భక్తుల రాక, స్కానింగ్ పాయింట్ వద్ద, ప్రధానాలయంతో పాటు క్యూలైన్లు ప్రసాదం కౌంటర్లు ఇలా అన్ని ప్రాంతాలలో సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఆదివారం ఉదయం నుండే ఆయా ప్రాంతాలలో సిబ్బంది అధికారులు విధులు నిర్వహించడం కనిపించింది.

సెల్‌ఫోన్ వినియోగంపై ఆగ్ర‌హం
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు సెల్ఫోన్ వాడుకను నిషేధించినప్పటికీ పలు ప్రాంతాలలో భక్తులు సెల్ ఫోన్ వాడడం కనిపించింది. ముఖ్యంగా అమ్మవారి దర్శనానంతరం మహా మండపం పెదరాజ గోపురం వద్ద భక్తులు సెల్ఫోన్లో ఫోటోలు చిత్రీకరించడం కనిపించడంతో ఈవో సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు సెల్ఫోన్లను క్లాక్ రూంలో భద్రపరిచే విధంగా వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. అదే ప్రాంతంలో సెల్ఫోన్ వాడుతున్న కొందరికి అవగాహన కల్పించారు.

Leave a Reply