Bhimavaram | వివాదాలు రాకుండా..

Bhimavaram | వివాదాలు రాకుండా..

Bhimavaram, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి (T.Rahul Kumar Reddy) సూచించారు. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులైన వారి అందరికీ ఇళ్ళు, పిజిఆర్ఎస్ పిర్యాదుల ప్రగతి పై ఆర్డీవోలు, తాహసిల్దార్లు, ఎం ఎల్ ఓ లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు, వివాదాలు రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు 1 కోటి 25 లక్షలు గన్ని బ్యాగులు అవసరం ఉండగా, 50 శాతం గన్ని బ్యాగులను మిల్లర్స్ వద్ద తీసుకొని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం రవాణా కొరకు ఇప్పటి వరకు 2,544 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని మరో 1000 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రతి ఆర్ ఎస్ కే లో గన్ని బ్యాగుల ఇష్యూ, రిసిప్ట్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ప్రతి మిల్లు వద్ద రెండు మూడు ప్రదేశాలలో క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయాలన్నారు. ట్రక్ షీట్, ఎఫ్ టి ఓ జనరేట్ అయ్యాక సంబంధిత రైతు మాత్రమే వేలిముద్ర వేయాలన్నారు.

అన్ని ఆర్ఎస్కే లలో అందుబాటులో ఉన్న గోనె సంచులు, వినియోగించిన గన్ని బ్యాగులు, బ్యాలెన్స్ గోనె సంబంధించి తాజా వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ త్వరగా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. అందరికీ ఇల్లు స్కీములో ఇప్పటి వరకు అర్హులైన 4,500 మంది దరఖాస్తులు సంబంధించి పాత లే అవుట్ లో ఖాళీగా ఉన్నచోట సర్దుబాటు చేయాలన్నారు. ఎంత వరకు సర్దుబాటు చేయగలమో మ్యాపుల్లో గుర్తించి జిల్లా రెవెన్యూ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పాత లేఔట్ లో సర్దుబాటు కానీ లబ్ధిదారులకు ఊరికి దగ్గరలో ఇల్లు కట్టుకొనుటకు భూములు సేకరించి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పిజిఆర్ఎస్ పిటిషన్లు పరిష్కారం పై అధికారులు శ్రద్ధ తీసుకొని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

“మొంథా తుపాను” (Mondha cyclone) సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పాడైన ఇళ్ల నష్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన తాజా నివేదిక సత్వరమే పంపించాలని, నిబంధనల మేరకు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. పునరావాస కేంద్రాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి పూర్తి నివేదికలను తక్షణమే సమర్పించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ గూగుల్ మీట్ లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డీఎస్ఓ ఎం సరోజ, ఆర్డీవోలు, తాసిల్దార్లు, డి సి ఓ, ఎంఏవోలు, ఎం ఎల్ ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply