TG | రాజలింగమూర్తి హత్యపై సీఐడీ విచారణ ….ఆదేశించిన సీఎం రేవంత్
హత్యకు బీఆర్ఎస్ నేతలే కారణమంటున్న హతుడి భార్య
ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు
భూతగదాలే కారణమంటున్న పోలీసులు
హైదరాబాద్ , ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాజలింగమూర్తి దారుణ హత్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశించారు. కాళేశ్వరం అక్రమాలపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేసారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులే రాజలింగమూర్తిని చంపారని మృతుడి భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నడిరోడ్డు మీద తన భర్తను హత్య చేయించారన్న రాజలింగమూర్తి భార్య సరళ చెబుతూ రోదించారు.
భూ వివాదాలే కారణమంటున్న పోలీసులు
రాజలింగమూర్తి హత్యకు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి కారణమని తొలుత ఆరోపణలు రాగా.. భూ వివాదాల నేపథ్యంలో ఆయన హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు హత్యకేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిపై మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్య కేసులో నిందితులైన రేణుకుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కొమురయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు – డీఎస్‌పీ సంపత్ రావు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సంపత్అవు తెలిపారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని చెప్పారు. హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయని, హత్యకు ఇతర కారణాల కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారాస ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి (47) హత్యకు గురయ్యారు. ఈ హత్యపై తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో) ఆరా తీశారు.