Bihar | బీహారీ బాద్​ షా నితీశే

బీజేపీ బంట్రోతే
కాంగ్రెస్​ గప్​ చిప్​
ఆర్జేడీ వా,,,వా..
ఇదీ బీహారీ ఇన్​ సైట్​ స్టోరీ

Bihar | ( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్)​ బీహార్​ లో ఓట్​ చోరీ అపవాదు ఫలించలేదు. ఇంటింటికీ సర్కారు ఉద్యోగాన్ని బీహారీలు నమ్మలేదు. నెలవారీ సంక్షేమ ఊరింతకు మహిళలు లొంగలేదు. మహాగఠబంధన్  ‘బీహార్ కా తేజస్వీ ప్రాణ్’ కనీసం ప్పందించలేదు. ఇవన్నీ ఉత్తుత్తి హామీలుగా పక్కన పెట్డేశారు. ఉచితాను ఉచిత పథకాలకు అసలు లొంగలేదు. ఫలితంగా బీహారీలు ఎన్డీయేకే పట్టం కట్టారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం .. దశమ అవతారంలో  మళ్లీ  సీఎంగా నితీష్​ కుమార్​ ప్రమాణం చేయనున్నారు. ఓడిన ప్రతిక్షం ఎన్నికారణాలైనా చెప్పవచ్చు. తూచ్​ తొండీ అనొచ్చు. కానీ ప్రజాతీర్పును అంగీకరించక తప్పదు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను సైతం ఎన్డీయే తన సత్తాను చాటుకుంది.  192 సీట్ల  ఆధిక్యంలో NDA ఉంది. మేజిక్​ ఫిగర్​ ను దాటిపోయింది. ఒకరకంగా బీహార్​ లో ఎన్డీయే స్వీప్​ చేసినట్టే.

ఇక  నితీష్ కుమార్ నేతృత్వంలోని JD(U) 84 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, BJP 80 సీట్లలో ఆధిక్యంలో ఉంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఆర్వీ( LJP-RV) 23 సీట్ల ఆధిక్యంలో ఉంది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్​ ఏ ఎం ( HAM ) 4 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మహాఘటబంధన్ కేవలం 48 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది, తేజస్వీ నాయకత్వంలోని  (RJD) 35 సీట్లలో ఆధిక్యంలో ఉంది. CPI (ML) 6 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 5 సీట్ల ఆధిక్యంలో కొట్టిమిట్టాడుతోంది.  

CPIM 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభ దశలో తీవ్ర పోటీ ఉంటుందని దేశంలోని ఇతర రాష్ట్రాల రాజకీయ పరిశీలకులు భావించారు.   కానీ ఫలితాలు ఏకపక్షంగా దూసుకుపోతున్నాయి.  అధికార NDA తన ఆధిక్యాన్ని నిమిష నిమిషానికి పెంచుకుంటోంది. ఓటర్లకు ప్రత్యామ్నాయ ఎంపికగా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ జాన్ సూరజ్ పార్టీ ఉదయం 11 గంటల వరకు ఆధిక్యంలో కనిపించినా.. కొన్ని గంటల్లోనే జెఎస్పీ కనుమరుగైంది.   

ఇప్పటి వరకూ ముస్లీం ఓటు బ్యాంకుగా భావించిన ఎంఐఎం పార్టీకి చుక్కలు కనిపించాయి. ముస్లీంల ఓటు ఖాతా చినిగిపోయింది.  ఎన్డీయే (NDA) భారీ  ఆధిక్యంతో  తేజస్వి యాదవ్ భారతదేశంలోనే  అతి పిన్న వయస్సులోనే  మఖ్యమంత్రి కావాలని తేజశ్వీ యాదవ్​ కన్న కలలు అడియాశలయ్యాయి.  నితీష్ కుమార్ 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నయా రికార్డు సృష్టించే అవకాశం లభించింది. కానీ ఎన్నికల వేళ.. ప్రధాన సీఎం అభ్యర్థిగా నితీశ్​ కుమార్​ ను ఎన్డీయే గుర్తించలేదు. నెంబర్​ వన్​.. టూను కాదని థర్డ్​ అభ్యర్థిని సీఎంగా బీహార్​ గద్దెపై నిలబెడుతుందా? లేక బీజేపీ ఆశల్ని నెరవేర్చుకుంటుందా? ఈ ప్రశ్నలు పక్కన పెడితే.. దశల వారీ సీఎంలు తెరమీదకు వస్తే.. తొలి సీఎంగా నితీశ్​ కూర్చోవటం ఖాయం. ఆ తరువాత రాజకీయ పరిణామాలను ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు.  

ఎందుకంటే.. ఆయన గోడ దూక గలడు. గోడను కూల్చగలడు.లాలూ యాదవ్​  జంగిల్​ కింగ్​ డమ్​ నుంచి బీహార్​ ను కాపాడిన ఏకైక యోథుడుగా బీహారీల మదిలో ఉన్న నితీశ్​ కుమార్​ ను బీజేపీ కాదనే దైర్యం చేయదు. ఒక వేళ అడ్డదారికి ట్రైచేస్తే.. కేంద్రంలో మోడీ సర్కారు కుప్పకూలిపోతుంది. ఇది గ్యారెంటీ. సో.. నితీశ్​ కుమార్​ బీహారీ టెన్​ టన్​ సీఎం కావటం ఖాయమని రాజకీయ పరిశీలకుల అంచనా.

Bihar | నితీశ్​ ఆషామాషీ కాదు

బీహార్ రాజకీయ (Bihar Politics) చిత్ర పటంలో.. ప్రజాస్వామ్యం ఓ బేల. పెత్తందారి ధన బలం..అసుర బలగం ఆధిపత్యానిదే అంతిమ తీర్పు. భారతావనికి స్వాతంత్ర్యం రాక ముందే 1946లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరిగాయి. ఆ తరువాత 1952 నుంచి .. బీహార్ రాజకీయ ప్రస్తావనంలో.. అనేక సార్లు ప్రజాస్వామ్యానికి పరాభవం తప్పలేదు. 1969 నుంచి 2005 వరకూ ఎప్పుడు రాష్ట్రపతి పాలన (President’s Rule) విధిస్తారో.. బీహారీలకు తెలీదు. 1961 నుంచి ఎప్పుడు ఎవరు సీఎం అవుతారు? ఎన్నాళ్లు సీఎం పదవిలో ఉంటారు? ఎవరి పీఠాన్ని ఎవరు కూల్చుతారు? ఏ కులాధినేత సీఎం అవుతాడు? 64 ఏళ్లు అస్థిర పాలనలో .. కొట్టుమిట్టాడిన బీహారీలు.. 2015 నుంచి సుస్థిర పాలనలో ప్రశాంత జీవనం గడుపుతున్న మాట వాస్తవం. తాజాగా.. దొంగ ఓట్ల చోరీ… విదేశీ దొంగ ఓటర్ల నినాదంతో.. అటు ఇండియా కూటమి.. ఇటు ఎన్డీయే మధ్య జరిగిన  జగడంలో కాంగ్రెస్​ ఓడిపోయింది.  

Bihar | వయా అతిథి పాత్రలో వచ్చి..


1996లో పశుగ్రాసం కుంభకోణం ఆరోపణలో జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav).. రాష్ట్రీయ జనతాదళ్ నెలకొల్పారు. తన స్థానంలో తన సతీమణి రబ్రీదేవీని సీఎంగా ప్రకటించారు. ఆమె 2000 వరకూ పాలించారు. ఇక 1999లో ఎంపీగా గెలిచిన నితీశ్ కుమార్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో .. ఏ కూటమికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ రాలేదు. ఎన్డీయే కూటమికి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూటమికి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  మేజిక్ ఫిగర్ 163 కు లాలూ ప్రసాద్ నాలుగు స్థానాలు, ఎన్డీయే కూటమి 12 స్థానాల్లో వెనుకపడ్డాయి. తొలుత ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయేను గవర్నర్ ఆహ్వానించారు. సరీగా అప్పుడే.. అటల్ బిహారీ వాజ్ పేయి హితుడు నితీశ్ కుమార్ తెరమీదకు వచ్చాడు. 67 మంది ఎమ్మెల్యేల బలాన్ని బీజేపీ త్యాగం చేసింది. తమలో సగం బలశాలి 34 ఎమ్మెల్యేల సమతాపార్టీకే సీఎం పదవిని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముందీ… 2003 మార్చిన బీహార్ 22వ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల ప్రదర్శనకు గవర్నర్ వారం రోజుల గడువు ఇచ్చారు. కానీ బలప్రదర్శనలో నితీశ్ కుమార్ కు ఓటమి తప్పలేదు. మార్చి 10 రాజీనామా చేశారు. యధావిధిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు కొనసాగించారు. కానీ.. బీహార్ సీఎం కావటమే లక్ష్యంగా.. ఆయన రాజకీయ పావులు కదుపుతూనే ఉన్నారు.

Bihar | 2005 నుంచి దశ తిరిగింది

2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో నితీశ్ కుమార్ దశ తిరిగింది. ఓబీసీ కుర్మి నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలు హయాంలో, వెనుకబడిన కులాల అభ్యర్థులు బీహార్ అసెంబ్లీలో ఆధిపత్యం చెలాయించారు, అందులో సగం సీట్లను పొందారు. ఈ శక్తివంత సామాజిక సమాజం ఆకాంక్షతో ఓబీసీల మధ్య ఘర్షణకు దారి తీసింది, సామాజిక న్యాయం-అభివృద్ధి నినాదంతో బీహార్ లో నితీశ్ కుమార్ తన రాజకీయ పునాదిని పటిష్టపర్చారు. నితీశ్ కుమార్ సంక్షేమాస్త్రం ఫలించింది. బాలికలకు సైకిళ్ళు, స్కూళ్లల్లో భోజనం అమలుతో భారీ సంఖ్యలో బాలికలు పాఠశాలల్లో చేరారు. సర్కారీ స్కూళ్లల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. 2010 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది. నితీశ్ కుమార్ మళ్ళీ సీఎం అయ్యారు. ఎన్డీయే కూటమి 206 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ 22 సీట్లకు పరిమితమైంది. బీహార్ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేశారు, రక్తపాతం లేదు. హింస లేదు. ప్రశాంత ఎన్నికలు జరిగాయి. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ చరిష్మా తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో తన పార్టీ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్, మే 17, 2014న రాజీనామా చేశారు. ఇక తొలిసారిగా బీజేపీ సీఎం బీహార్ లో తెరమీదకు వచ్చారు. జితన్ రామ్ మాంఝీ బాధ్యతలు స్వీకరించారు.

Bihar | కొన్ని గంటల్లోనే..

బీజేపీ సహచర్యంలో సీఎం పదవిని ఎంజాయ్ చేసిన నితీశ్ కుమార్ ప్లేట్ ఫిరాయించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూతో మహాగఠ్ బంధన్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ, బీజేపీ లేవనెత్తిన ఆరోపణలను తిప్పికొడుతూ, మహా కూటమి తరపున ఎన్నికల సమయంలో నితీశ్ కుమార్ దూకుడుగా ప్రచారం చేశారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని చిత్తు చేశారు. 178 సీట్లతో మహాగఠ్ బంధన్ ఘన విజయం సాధించింది, ఆర్జేడీ 80 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 71 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 2015 నవంబర్ 20 న ఐదవ సారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు . ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావటంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. రాష్ట్రీయ జనతా దళ్ అందుకు నిరాకరించింది, అంతే ! నితీశ్ కుమార్ జూలై 26, 2017న రాజీనామా చేశారు, అంతే ! మహా కూటమి కథ రాజీనామాతో ముగిసింది. నితీశ్ కుమార్ యథాప్రకారం మళ్లీ ప్లేటు ఫిరాయించి ప్రధాన ప్రతిపక్షం ఎన్డీయేలో చేరారు. కొన్ని గంటల్లోనే మళ్లీ సీఎం పదవిని అలంకంరించారు.

Bihar | ఇలా ఎన్డీయేలోకి వెళ్లి

2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ప్రజలు రెండు కూటములకు అధికారం ఇవ్వలేదు. మహాగఠ్ బంధన్ కు 110 సీట్లు లభిస్తే ఎన్డీయే కూటమికి 125 సీట్లు వచ్చాయి. అతి పెద్ద కూటమిగా గుర్తించి ఎన్డీయే కూటమికి సర్కారు ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చారు. ఇక మహాగఠ్ బంధన్ధికారానికి దూరమైంది. ఇక నితీశ్ కుమార్ ఏడవసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 8, 2020న, రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో రాజ్యసభ సీటు ఖాళీ కావటంతో బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 9 2022 ఆగస్టు 9న నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలిగిందని, మహాగఠ్ బంధన్ లో తిరిగి చేరిందని, ఆర్జేడీ. కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 10న ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మహాగఠ్ బంధన్ కు టాటా2024 జనవరి 28 న నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్ బంధన్ అనుబంధం తెంచుకున్నారు. ఎన్డీయే కూటమిలో తిరిగి చేరారు, అదే రోజున, ఆయన 24 ఏళ్లల్లో తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎన్డీయే కూటమికి జేడీయూ దిక్కు కావటంతో.. మళ్లీ నితీష్​ కుమార్​ తెర మీదకు వచ్చారు. కానీ ప్రజా వ్యతిరేకతను తప్పించేందుకే ఆయనను సీఎం అభ్యర్థిత్వం నుంచి పక్కన పెట్టారు. మూడవ స్థానంలో ప్రకటించారు. కానీ నితీష్​ తన వ్యూహాన్ని అమలు చేశారు. బీజేపీతో సమాన సీట్ల బేరం కుదుర్చుకున్నారు. బీజేపీ కంటే ఎక్కవ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శించారు. ఒకటి రెండు సీట్లు తేడా ఉన్నా.. తానే సీఎం అని నితీష్​ మొండి పట్టు పట్టడం గ్యారెంటీ.. హితువా.. అని బీజేపీ జేడీయూ కాళ్లు కడగాల్సిందే.. ఇదీ రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యానం.

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B7%E0%B1%8D_%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D

Leave a Reply