Medak | యువతరంతోనే నవ సమాజ నిర్మాణం..

Medak | యువతరంతోనే నవ సమాజ నిర్మాణం..
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : యువతరంతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు (Madhavaneni Raghunandan Rao) పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా యువజన వ్యవహారాలు అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు మెదక్ పట్టణ పురవీధుల్లో మార్మోగాయి.
జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ రాందాస్ చౌరస్తాలో ముగిసింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events) అలరించాయి. రాష్ట్రీయ ఏక్తా దివస్ లో భాగంగా విద్యార్థులతో దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడంలో తాము భాగస్వాములవుతామని ఏక్తా ప్రతిజ్ఞను చేశారు.

ఈసందర్భంగా ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం తర్వాత 565 సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసిన సమైక్యతవాది, మానవతావాది అని తెలిపారు. పటేల్ భారతదేశ ఉక్కుమనిషిగా భావించబడి అనేక పదవులను అధిష్టించి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత సమాఖ్యలో విలీనం చేసిన ఘనత ఆయనదని, నేటి యువత సర్దార్ పటేల్ ఆదర్శాలతో ముందుకు సాగి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.

జాతీయ సమైక్యత (National integration) తో పాటు అంతర్జాతీయ సమైక్యత భాగంలో భారతీయ యువత ముందుండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలు భారత యూనియన్ లో కలిసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
విద్యార్థులు (students) మన దేశ గొప్పతనాన్ని తెలుసుకొని తమ భావి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని, దేశ సమగ్రతను కాపాడేందుకు సామాజిక స్పృహను అలవర్చుకోవాలన్నారు. ఆ మహనీయుని కృషి ఫలితంగానే నేడు మన దేశాన్ని ఒకే చిత్రపటంలో చూస్తున్నామని తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ ప్రగతికి కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా యువజన క్రీడలు నిర్వహణ అధికార రంజిత్ రెడ్డి, డిఐఎస్ఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
