AP | సమస్యల పరిష్కారానికే..
కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddhaprasad) పేర్కొన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు. గురువారం అవనిగడ్డలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అవనిగడ్డ (Avanigadda) గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమకు శానిటరీ కాంట్రాక్టరుతో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించి, తమకు వేతనాలు నేరుగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మోపిదేవి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ (Praja Darbar) కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేశారని, వాటిని త్వరగా పరిష్కరించమని ఆయ శాఖల అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, అధికారులు పాల్గొన్నారు.

