- నిరంతర పర్యవేక్షణకు ప్లాన్ ఆఫ్ యాక్షన్..
- జిల్లా స్థాయిలో 33 బృందాలు
- రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను సిద్ధం చేసింది.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు. రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ఉదయం ఆరు గంటలకల్లా బృందాలకు ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతాల వివరాలు పంపిస్తామన్నారు. ముఖ్యంగా ఓవర్లోడింగ్ లారీలు, బస్సులు, సాండ్, ఫ్లైయాష్, బిల్డింగ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, అలాగే ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలు తనిఖీకి వస్తాయని తెలిపారు.
ఉల్లంఘనలు గుర్తిస్తే పెనాల్టీలతో పాటు వాహనాలను సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఒక్కో బృందంలో DTC, MVI, AMVIలతో పాటు ఇతర సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు. అయితే, ఈ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై వేధింపులు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలు…
జెటిసి (ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ను నెలవారీ రొటేషన్ పద్ధతిలో ఉపయోగిస్తారు. సెలవు దినాల్లో కూడా కనీసం ఒక బృందం రోడ్డుపై ఉండేలా చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రతి వారం కనీసం రెండు సార్లు అంతర్రాష్ట్ర బస్సులపై తనిఖీలు తప్పనిసరి చేశారు. ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు, ఓవర్‌స్పీడ్, ఓవర్‌లోడ్ వాహనాలను ఎల్లప్పుడూ సీజ్ చేయాలని ఆదేశించారు. సీసీ బస్సుల్లో అనధికార మార్పులు చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.
గత వారం చేవెళ్ల ప్రమాదం తర్వాత చర్యలు..
చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం గత వారం రోజులలో 2,576 వాహనాలపై కేసులు నమోదయ్యాయి. వీటిలో 352 ఓవర్‌లోడ్ లారీలు, 43 బస్సులు ఉన్నాయి. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వేగవంతం చేయాలని, ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున రవాణా శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహిళా ఆటో అనుమతులు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్ సేఫ్టీ మంత్‌లో ప్రజల్లో అవగాహన పెంచేందుకు వ్యాసరచన పోటీలు, విద్యార్థుల కోసం ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జెటిసిలు రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

