- ఏ క్షణానైనా భారత్ దాడి చేసే అవకాశం…
- ఎన్ఎస్ఏ, ఐఎస్ఐతో, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశం..
- వైమానిక స్థావరాల్లో రెడ్ అలర్ట్..
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఢిల్లీలో జరిగిన పేలుడుతో పాకిస్తాన్ గజగజలాడుతోంది (Alert mode). భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానంతో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. ఈ క్రమంలో పాక్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దులో గస్తీని ప్రారంభించినట్లు సమాచారం.
అలాగే పాక్ త్రివిధ దళాధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ఎన్ఎస్ఏ, ఐఎస్ఐతో సమావేశమైనట్లు తెలిసింది. ఢిల్లీ ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తరువాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాలు, వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం గానీ, సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని నిఘా సంస్థల నుండి పాకిస్తాన్‌కు హెచ్చరికలు అందాయి. ఫలితంగా పాకిస్తాన్ తన సైన్యం, నేవీ, వైమానిక దళాలను హైఅలర్ట్ ఉంచింది. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్.. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలను ఆదేశించింది.
Alert | కుట్రకు పాల్పడిన వారిని వదిలిపెట్టం : భూటాన్ పర్యటనలో ప్రధాని మోడీ!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు దుర్ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ థింపూ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుడు కుట్రకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని, కుట్ర వెనుక ఉన్నవారిని కూడా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోడీ హెచ్చకలతో పాకిస్తాన్ భయపడుతోంది. ఏ క్షణానైనా దాడులు చేసే అవకాశం ఉందని పాక్ భావిస్తోంది.

వాయు రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసిన పాకిస్తాన్
అంతే కాకుండా భారతదేశం నుండి ఏదైనా దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ అప్రమత్తం చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా, ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తోంది. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి 12 వరకు నోటమ్ (ఎయిర్మెన్కు నోటీసు) జారీ చేసింది. అంటే ఈ రెండు రోజుల్లో, సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు, భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయి.
బ్రిటీష్ పౌరులను అప్రమతం చేసిన యూకే
భారత్-పాక్ సరిహద్దుకు పది కిలోమీటర్ల పరిధిలో జమ్ముకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో ప్రయాణించవద్దని బ్రిటిష్ పౌరులకు యూకే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇండియాలోని ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సూచించింది.

