- గజరాజులకు ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రి
- ఏనుగుల విన్యాసాలను స్వయంగా సెల్ఫోన్‌లో చిత్రీకరణ
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పలమనేరు మండలంలోని ముసలిమడుగులో ఉన్న కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శించారు.
శిబిరంలో ఉన్న ఏనుగులతో సమయం గడిపి, వాటికి స్వయంగా ఆహారం అందించి, గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన ఏనుగులు ప్రత్యేక విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఏనుగులు కర్ర దుంగలను మోసుకుంటూ ఆయన వద్ద ఉంచి, నమస్కరించాయి. ఈ దృశ్యాలను పవన్ కళ్యాణ్ తన మొబైల్ ఫోన్‌లో స్వయంగా చిత్రీకరించారు.
శిబిరంలో కుంకీ ఏనుగులతో ప్రత్యేక పరేడ్ నిర్వహించగా, గజరాజులు పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా వాటికి అభివాదం చేశారు. శిక్షణ పొందిన ఏనుగులు అడవిలో దారి తప్పిన మదపుటేనుగును ఎలా బంధిస్తాయో ప్రదర్శించాయి. ముందు నుంచి ఒక ఏనుగు మదపుటేనుగును లాక్కొనగా, వెనక నుంచి మరో రెండు ఏనుగులు తోసి సహాయం చేయడం ప్రదర్శనలో భాగమైంది. పవన్ కళ్యాణ్ ఆ దృశ్యాలను ఆసక్తిగా వీక్షించారు. ఏనుగులకు బెల్లం అందించి వాటితో స్నేహపూర్వకంగా మెలిగారు.
శిబిరం కార్యకలాపాలపై అటవీశాఖ అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరణ ఇచ్చారు. కుంకీ ఏనుగుల శిక్షణ, సంరక్షణ, వాటి ఆహార సదుపాయాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. అడవుల్లో వన్యప్రాణుల దాడులను నివారించడంలో కుంకీ ఏనుగుల పాత్రను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “వన్యప్రాణుల సంరక్షణకు కుంకీ ఏనుగులు కీలకం. వాటి ఆరోగ్యం, శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం” అని సూచించారు. అలాగే, అటవీశాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిబిరంలోని సదుపాయాలు, ఏనుగులకు అందించే ఆహారం, వైద్య సేవలు, ట్రైనింగ్ విధానాలను పరిశీలించారు.
ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ దూడి, డీఎఫ్ఓ సుబ్బరాజు, రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అటవీశాఖ ముసలిమడుగు కుంకీ ఎలిఫెంట్ క్యాంప్ రాష్ట్రంలో ఒకే తరహా శిక్షణా కేంద్రంగా పేరుపొందింది. అడవుల్లో చిక్కుకుపోయిన లేదా మార్గం తప్పిన ఏనుగులను పునరావాసం చేయడంలో ఈ శిబిరం కీలక పాత్ర పోషిస్తోంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఈ శిబిరాన్ని సందర్శించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.








