భూగర్భజలాలు పెరిగాయ్!

- యాసంగికి ఢోకా లేనట్లే
- పంటల సాగు పెరిగే అవకాశం
- వరి, మొక్క జొన్న పంటలపైనే దృష్టి
- గతఏడాది 7.71 మీటర్లలో నీటిమట్టం
- ఈ సారి 6.14 మీటర్లలోనే
- గతసారితో పోలిస్తే 1.57 మీటర్లు పెరిగిన నీటిమట్టం
- ఆమన్‌గల్, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, కడ్తాల్ మండలంలోనే కాస్త తగ్గుదల
- 23 మండలాల్లో పెరిగిన భూగర్భజలం
(ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : వానలు పుష్కలంగా కురిస్తేనే నీటిమట్టం పెరుగుతుంది.. గతసారితో పోలిస్తే ఈసారి ఆశించినమేర వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. గతేడాది అక్టోబర్ మాసంతో పోలిస్తే జిల్లాలో నీటిమట్టం పెరిగింది. భూగర్భజలాలు పెరగడంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. గతసారితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. నీటి వసతులు ఉన్న రైతులు యాసంగిలో కూడా వరి పంటకే ప్రాధాన్యమిస్తారు. పంట చేతికి వస్తుందనే నమ్మకంతో ఎండలను సైతం లెక్క చేయకుండా సాగు వైపు మొగ్గు చూపుతారు. ఈసారి వానలు దండిగా కురవడంతో యాసంగి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు యాసంగి సాగుపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 7.71 మీటర్లలో నీటిమట్టం ఉండగా ఈసారి 6.14 మీటర్లకు పెరిగింది.. ఆమన్‌గల్, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలో మాత్రమే కాస్త నీటిమట్టం తగ్గింది. మండలం మినహా జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో నీటిమట్టం పెరిగింది.

యాసంగిలో పంటల సాగు కత్తిమీద సామె. రోజురోజుకు భూగర్భజలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మెజార్టీ రైతులు వెనకా ముందు ఆలోచించి పంటలు సాగు చేస్తారు. భూగర్భజలాలపై పూర్తి నమ్మకం కుదిరితేనే రైతులు పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతారు.. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. అంతా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు. పుష్కలంగా వర్షాలు కురిస్తేనే భూగర్భజలాలు పెరుగుతాయి. గత వానాకాలంలో జిల్లాలో ఆశించినమేర వర్షాలు పడ్డాయి. దీంతో గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టం 1.57 మీటర్లమేర పెరిగింది… జిల్లాలో 27 మండలాలున్నాయి. ఇందులో ఆమన్‌గల్ మండలం మినహా అన్నిమండలాల్లో నీటిమట్టం పెరిగింది. జిల్లా పరిధిలోని కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే గతసారితో పోలిస్తే నీటిమట్టం కొంతమేర తగ్గింది. మిగతా 23 మండలాల్లో మాత్రం నీటిమట్టం పెరిగింది. శేరిలింగంపల్లి మండలంలో 1.67 మీటర్లు, సరూర్‌నగర్ మండలంలో 1.35 మీటర్లు, ఆమన్‌గల్ మండలంలో -0.42 మీటర్లు, కడ్తాల్ మండలంలో 0.02 మీటర్లమేర నీటిమట్టం తగ్గింది. మిగతా 23 మండలాల్లో మాత్రం నీటిమట్టం పెరిగింది. గత వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 725.8 మిల్లిdమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 937.4 మిల్లిdమీటర్లమేర వర్షం కురిసింది. ఈసారి వానాకాలంలో 750.5 మిల్లిdమీటర్లు సాధారణ వర్షపాతం ఉండగా 985.6 మిల్లిdమీటర్లు కురిసింది. గత అక్టోబర్ మాసంలో కూడా వర్షాలు పడ్డాయి. జిల్లాలో 107.7 మిల్లిdమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 148 మిల్లిdమీటర్లమేర వర్షం కురిసింది. ప్రస్తుత నవంబర్ మాసానికి సంబంధించి ఇప్పటికే 15.4 మిల్లిdమీటర్లమేర వర్షం కురిసింది.

ఈసారి ఆశించినమేర వర్షాలు కురవడంతో యాసంగి పంటలకు ఢోకా లేదు. పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటల్లో నీళ్లు చేరాయి. దీంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో గట్టెక్క వచ్చుననే ధీమాతో రైతులు ఉన్నారు. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ రైతులు వరి పంటనే ప్రధాన పంటగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో యాసంగిలో కూడా వరి పంటకే ప్రాధాన్య మిస్తారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. అంతా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు. ప్రస్తుతం బోర్లలో దండిగా నీళ్లున్నాయి. వరితోపాటు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వానాకాలంలో వరినే ప్రధాన పంటగా సాగు చేసారు. సగం మండలాల్లో వరి పొట్ట దశలో ఉంది. మరికొన్ని రోజులు కోతకు వస్తాయి. యాసంగిలో కూడా వరినే ప్రధాన పంటగా సాగు చేయనున్నందునా ఆ దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. యాసంగిలో ఎండల నేపథ్యంలో రైతులు వెనకా ముందు ఆలోచించి పంటలు సాగు చేస్తారు. ఆశించినమేర వర్షాలు కురిసినందునా వెనకాముందు ఆలోచించకుండానే వరినే ప్రధాన పంటగా రైతులు సాగు చేయనున్నారు.
