- గోదావరిఖనిలో మహిళ ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని సింగరేణి మెడికల్ కాలేజ్ ఎదుట శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనరెడ్డి అప్రమత్తంగా వ్యవహరించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే..
చెట్ల పొదల్లో ఓ మహిళ తన శరీరంపై పెట్రోలు పోసుకుని మంటలు అంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేయగా, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనరెడ్డి సిబ్బందితో కలిసి మెరుపువేగంతో అక్కడికి చేరుకున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ అక్కడ మహిళ సగానికి పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను స్వయంగా ఎత్తుకుని, పోలీసు సిబ్బంది, మెడికల్ విద్యార్థుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమయానుకూలంగా వైద్యం అందించడంతో మహిళ ప్రాణాలు నిలిచే అవకాశం కల్పించారు. మహిళ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనరెడ్డి చూపిన అప్రమత్తత, మానవతా స్పృహ స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

