బంగారమ్మ తల్లీ..

ఆదుకో కర్నూలు కలెక్టరమ్మ ,, ఆట్టేకల్లు పంచాయతీ ఆక్రందన

( ఆస్పరి, ఆంధ్రప్రభ)

ఇది 2025 సంవత్సరం.  డిజిటల్‌ యుగం.  స్మార్ట్‌ పరిపాలన. , గ్రామ సచివాలయాల విస్తరిస్తున్నాయి.  పల్లెల్లో అభివృద్ధి గాలులు వీస్తున్న  రోజులివి. కానీ ఆస్పరి గ్రామం అంచున.. అట్టేకల్లు గ్రామం మాత్రం వందేళ్లు అట్టడుగు స్థాయికి జారిపోయింది.  ఆ ఊరికి పంచాయతీ ఉంది, అధికారులు ఉన్నారు, కానీ గూడు లేదు.  కుర్చీలు లేవు, బంగారమ్మ ఆలయం అరుగే దిక్కు. ఆఫీసర్లు లేకపోతే ఏంటీ? ఊరు ఉంది. ఊరులో జనం ఉన్నారు. సర్కారుకు కప్పం కట్టేస్తారు. సర్కారుకు కావాల్సింది అదే. కానీ ప్రజలకు తాగటానికి నీళ్లు ఉన్నాయా? హంద్రీ కాలువ నీళ్లు అందుతున్నాయా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం  ఓ ఒక్కటీ అడగొద్దు. ఇది సరే.. ఈ ఊరి భూములూ ఈ ఊరులో లేవు. ఆ విషయం తెలిస్తే.. నోరు వెళ్లబెట్టాల్పిందే. ఇంతటి చిత్రం , విచిత్రం తెలియాలంటే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అట్టేకల్లు గ్రామానికి వెళ్లాల్సిందే.  ఓ  గుట్ట..పక్కనే వాగు… చిన్న వంతెన దాటగానే బంగారమ్మ గుడి, ఓవర్​ హెడ్​ వాటర్​ ట్యాంక్​ కనిపిస్తాయి. ఈ ఊరులో 250 ఇళ్లు కనిపిస్తాయి. ఇక ఈ ఊరికి జతగా  అయికల్లు అనే ఊరు ఉంది. ఇందులో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ రెండు ఊళ్లూ 2019 వరకూ బిల్లేకల్లు పంచాయతీలో ఉన్నాయి. అప్పటి సీఎం అట్టేకల్లు, అయినకల్లు గ్రామాలను కలిపి ఓ పంచాయతీగా మార్చారు. ఈ రెండు గ్రామాలు బిల్లేకల్లు నుంచి విడిపోయి స్వతంత్ర గ్రామాలుగా ఏర్పడ్డాయి. అట్టేకల్లు పంచాయతీగా ఏర్పడింది.

ఈ పంచాయతీకి భవనం రాలేదు. పంచాయతీ సిబ్బంది తమ కార్యకలాపాలకు బంగారమ్మ గుడి అరుగును ఎంచుకున్నారు. ఊళ్లో జనం అక్కడికి చేరుకుని తమ ఈతిబాధలు చెప్పుకోవటం ప్రారంభించారు. అనాది కాలం నుంచి రచ్చబండ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక పంచాయతీ అధికారులు ప్రతిరోజూ ఈ ఊరుకు రావటం మానేశారు. వీలు చిక్కినప్పుడు అతిథి దేవుళ్లు మాదిరిగా అట్టేకల్లు వచ్చి హాజరు వేసుకొంటున్నారు. అదేంటీ.. పంచాయతీ భవనం ఎందుకు లేదూ? అంటే.. అట్టేకల్లు భూములన్నీ బిల్లేకల్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. బిల్లేకల్లు రెవెన్యూ పరిధిలోనే అట్టేకల్లు రైతుల 2000 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ సాగు చేయటానికి పాతాళ గంగమ్మ కరుణించాలి. ఈ సంగతి పక్కన పెడితే.. తాగునీటి కోసం అలారు వంకదిన్నె నుంచి  హంద్రీ నీరు సరఫరాకు పైప్​ లైన్​ లు నిర్మించారు. కానీ ఎగువన బిల్లేకల్లు రైతులు ఈ నీటిని దిగువకు విడుదల చేయటం లేదు. పేరుకే పంచాయతీ గానీ.. ఇక్కడి ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద, హోదా లభించటం లేదు.  ‌‌‌‌‌‌  

అవస్థలు అన్నీ ఇన్నీ కావు

రోజువారీ సమస్యల నుంచి భూమి వివాదాలు వరకు అన్నిటికీ కూడా అట్టేకల్లు ప్రజలు బిలేకల్‌ సచివాలయం చేరాల్సిందే.తాము ఓటేసింది తమ పంచాయతీ అభివృద్ధి కోసం… కాని నేటి వాస్తవం వారిని వేరే గ్రామం ముంగిటికి తేలుస్తోంది.మాకు సులభంగా లభ్యమయ్యే సేవలు కోసం కూడా వేరే గ్రామంలో ఆశ్రయం కోరాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం!అని ప్రజలు గొంతు విప్పారు.

పంచాయతీ భవనం లేదు!

 జోగు లతశ్రీ సర్పంచి   

అట్టేకల్లు గ్రామ సర్పంచ్‌ జోగు లతాశ్రీ తన వంతు పోరాటం సాగిస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య అక్కడే అడ్డుకట్టేసుకుంది.మా గ్రామాభివృద్ధిని ఎవరు చూసుకుంటారు…? మాకు కూడా ప్రభుత్వ గౌరవం కావాలిఈ పంచాయతీ ఉన్నా ఒకటే,లేకపోయినా ఒకటే అని ప్రజలు అన్నారు.

ఇదేం పరిపాలన…..?

– శివకుమార్‌, మాజీ ఎంపీటీ-సీ:

అట్టేకల్లు మాజీ ఎంపీటీ-సీ శివకుమార్‌  మాట్లాడుతూ,  గ్రామ పంచాయతీకి భూములు అట్టేకల్‌ పేరుకే ఉన్నాయి.కానీ అధికారులు వేరే పంచాయతీలో పని చేయటం  ప్రజలకి మోసం చేయడం కాదా?..అంటూ ప్రశ్నించారు.ఈ పరిస్థితి కొనసాగితే ఆందోళన తప్పదంటు-న్నాం.పంచాయతీకి చెందిన ప్రతి అంగుళం మా పేరిట ఉండాలి.మాకు న్యాయం కావాలి అన్నారు.

ఇక మౌనం లేదు!

ఇప్పటి-కై-నా తమ పంచాయతీని  గుర్తించకపోతే రోడ్డుపైకి దిగి పోరాటం చేస్తాం. మన గ్రామ ప్రభుత్వం ఉన్నంతవరకు, మన అభివృద్ధి కోసం పోరాటం కొనసాగుతుంది” అంటు-న్నారు.ఇది అట్టేకల్‌ గ్రామ ప్రజల ఆవేదన… పోరాట శబ్దం.  అధికారుల చెవుల్లో ఈ నాదం వినిపించేలా సన్నద్ధం అవుతున్నారు. జిల్లా పరిపాలనకు ఇది ఒక పరీక్ష అవుతుంది.

Leave a Reply