- ఒళ్లూరు రాయల చెరువుకు గండి
కేవీబీపురం, ఆంధ్రప్రభ : అ్చప్పుడప్పుడే తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కొక్కరిగా నిద్రలేచేస్తున్నారు. అంతలోనే జలవిలయం మొదలైంది. ఒళ్లూరు రాయల చెరువుకు గండి పడటంతో చెరువుకట్ట తెగిపోయి నీరు ఉధృతంగా గ్రామాలపైకి దూసుకెళ్లింది. క్షణాల్లోనే కళత్తూరు, రాజులకండ్రిగ, పూడి, పాతపాలెం గ్రామాలు నీటిమయం అయ్యాయి. వందలాది ఇళ్లలోకి వరద నీరు చొరబడటంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ప్రజల కళ్లముందే పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కొన్నిచోట్ల నిల్వ ఉన్న ధాన్యం పాడైపోయింది. వాహనాలు, పశువులు నీటి ప్రవాహంలో కొట్టు-కుపోయాయి. ప్రాణాల మీదకు వచ్చింది అనుకున్న కుటుంబాలు మేడలపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. ఉదయం నుంచి విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు వేగంగా చేపట్టారు.
కళ్లెదుటే.. విలయం
కేవీబీ పురం మండలంలోని ఒళ్లూరు రాయల చెరువు కట్ట తెగి జల విలయం జరిగింది. గురువారం ఉదయం అకస్మాత్తుగా గండిపడటంతో పరిసర గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఒళ్లూరు, పాతపాలెం, కళత్తూరు, ఎంఏ రాజుల కండ్రిగ, మహదేవపురం, కాట్రపల్లి గ్రామాల్లో నీరు ఉధృతంగా ప్రవహించి వందల ఎకరాల వరి, మిర్చి, కూరగాయల పంటలు నీటమునిగాయి. కళ్లముందే నిముషాల వ్యవధిలో వరదనీరు గ్రామాలను చుట్టుముట్టింది. సమాచారం తెలిసి ప్రాణాలను కాపాడుకోవాలన్న ఆలోచన వచ్చేలోపే హఠాత్తుగా వరద గ్రామాలను ముంచింది. ప్రజలు ఇంటి మేడలపైకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు.
చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం
ముంపు గ్రామాలకు ముందే సమాచారం తెలిసి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రజలు వాపోయారు. చెరువు కట్ట బలహీనంగా ఉందని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటు-వంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. రాయల చెరువు ఆయకట్టు సుమారు 1,500 ఎకరాల వరకూ ఉందని రైతులు తెలిపారు. చెరువు సామర్థం సుమారు 0.75 టీఎంసీగా ఉన్నందున భారీ వర్షాలతో చెరువు నిండు కుండా ఉండటంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించిందని అధికారులు పేర్కొన్నారు.
లోతట్టు- ప్రాంతాల్లో నీటి ముట్టడి
కళత్తూరు, హరిజనవాడ ప్రాంతాల్లో చెరువు నీరు ఉధృతంగా దూసుకువెళ్లడంతో లోతట్టు ఇళ్లలోకి నీరు చేరింది. సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు మేర నీరు ఎగిసిపడుతూ బాధిత గ్రామాలను చుట్టేసింది. మానవ నష్టం లేకపోయినా వరదల ఉధృతిలో పలు మూగజీవాలు కొట్టుకుపోయాయి. వరద నీటి ప్రవాహంలో ద్విచక్ర వాహనాలు ,ఆటోలు, ట్రాక్టర్లు, పశువులు, కోళ్లు, కుక్కలు కొట్టుకు పోయాయి. కళ్లముందే వరదల్లో పశువులు, మేకలు బొమ్మల్లా కొట్టుకొని పోతూ ఉంటే కాపాడుకోలేని పరిస్థితిలో ఉండిపోయామని కన్నీటి పర్వంతమయ్యారు. వరదల్లో జరిగిన నష్టాలను పాడి, వ్యవసాయ, ఆర్ అండ్ బీ, విద్యుత్, ఉద్యానవన పంటల నష్టంపై జిల్లాలోని సంబంధించిన అధికారులు బాధిత గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి బాధిత కుటు-ంబాలతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేస్తున్నారు.
పొలాల్లో ఇసుక మేటలు
ఒళ్లూరు, పాతపాలెం, కళత్తూరు, ఎంఏ రాజుల కండ్రిగ, మహదేవపురం, కాట్రపల్లి గ్రామాలకు సంబంధించిన పంట పొలాలన్నీ నదులను తలపించేలా వరద నీరు నిలవ చేరింది. సుమారు రెండువేల ఎకరాల్లో రాళ్లు, ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వరద ఉదృతి గ్రామాలకే కాకుండా శ్రీకాళహస్తి పిచ్చాటూరు ప్రధాన మార్గంపై బీభత్సం సృష్టించడంతో రెండు గంటలపాటు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం రాత్రి జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగేదని గ్రామస్తులు తెలిపారు. కళ్లముందే జరిగిన ఉపద్రవాన్ని చూసి ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. తగ్గిన తర్వాత ఇళ్లలో బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు
రాయలచెరువు జలాశయాన్ని 1965 వ సంవత్సరంలో 750 మీటర్ల పొడవుతో రెండు కొండలను కలిపేలా చెరువు కట్ట నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 మీటర్ల లోతు, 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు యొక్క నీటి సామర్థం 88.29 మిలియన్ క్యూబిక్ అడుగులు.
దీని నిర్మాణం చేపట్టిన అప్పుడప్పుడు చిన్న చిన్న బోగడలు పడి నీరు పోవడం, తాత్కాలికంగా మట్టి మూటలు పేర్చడం చేసేవారు. తర్వాత 2014లో నీరు చెట్టు పథకంలో కట్టకు మరమత్తులు చేపట్టారు. ఆ తరువాత పాలకులు చెరువును పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కట్ట బాగా బహీనపడి, పర్యవేక్షణ కరువై లేక నేడు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
రైతుల అనుమానం
నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం.. చెరువు కట్టకు ఎలుకలు, పందికుక్కులు రంధ్రాలు చేయడం ద్వారానే బొగడా పడి క్రమేణా కట్ట తెగే వరకు వచ్చిందని చెబుతున్నారు. చెరువు కట్ట తెగిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది సహజ ప్రమాదమా లేక ఎవరి నిర్లక్ష్య ఫలితమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చెరువు మరమ్మతులకు నిధులు కేటాయించినప్పటికీ పనులు నాణ్యతలేమిగా జరిగాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గండి పడింది కాదు ఎవరో గండి కొట్టారేమో అని కొందరు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
రాయల చెరువు తెగి వరద ఉధృతికి తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు వైద్య సేవలు డాక్టర్ రాంనాయక్ బృందం ప్రారంభించింది. వరదలో మునిగిన పశువులకు వైద్య సేవలు డాక్టర్ పార్తిబన్ బృందం చికిత్స అందించారు. చనిపోయిన పశువులు, మేకల వివరాలను సేకరించడంలో సచివాలయ పశు సంవర్ధక శాఖ సహాయకులు నిమగ్నం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది బురదను తీసేసి పనులు చేపట్టారు. డ్రోన్ ద్వారా సమాచారం సేకరించే పనుల్లో రెవెన్యూ శాఖ అధికారులు నిమగ్నం అయ్యారు.
రూ.20 లక్షలు విడుదల చేసిన ఎంపీ
వరద బాధిత గ్రామాల కోసం ఎంపీ గురుమూర్తి వెంటనే స్పందించి రూ.20 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేశారు. తిరుపతి నుంచి ఆహార పదార్థాలు, తాగునీటి బాటిళ్లతో సహాయక లారీలు బయలుదేరాయి. ఎవరూ ఆకలితో ఉండకూడదు, ప్రతి బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోండి అని ఎంపీ సూచించారు.



