సైబర్ భద్రతపై అవగాహన…
ఎండపల్లి, ఆంధ్రప్రభ : సైబర్ జాగృతా దివస్(Cyber Awareness Day) సందర్భంగా వెల్గటూర్ ఎస్సై ఆర్. ఉమా సాగర్ ఆధ్వర్యంలో ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని అక్షర హై స్కూల్‌లో విద్యార్థులకు సైబర్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ములు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల మోసాలు, తెలియని లింకులు–APK ఫైళ్ల ద్వారా జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్ పద్ధతులపై విద్యార్థులకు వివరణ ఇచ్చారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఈజీ మనీ ఆశలకు లోను కాకూడదని అధికారులు సూచించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్(Multi-Level Marketing), నకిలీ ట్రేడింగ్, పెట్టుబడి మోసాలు మొదట లాభాలు చూపించి తర్వాత పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నట్లు వివరించారు.
టెక్నాలజీ అభివృద్ధితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొత్త పద్ధతుల్లో మోసాలు జరుగుతున్నాయని, ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ భయపెట్టే మోసాలకు గురి కాకూడదని తెలిపారు. అపరిచిత లింకులు, APK ఫైళ్లను ఓపెన్ చేయరాదని హెచ్చరించారు.
సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో 48 గంటలలో ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

