నల్గొండ నవంబర్ 6(ఆంధ్ర ప్రభ): వర్షాలు తగ్గినందున 17% తేమ వచ్చే విధంగా రైతులు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) రైతులకు సూచించారు. గురువారం రోజున నల్గొండ మండలం, జి.చెన్నారం, చర్లపల్లి లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.
ముందుగా జి. చెన్నారం వెళ్లిన జిల్లా కలెక్టర్ అక్కడ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దాన్యం , తేమ శాతం అన్ని వివరాలను నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు పంపించేందుకు ఎక్కువ లారీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీరియల్ నంబర్ తో సంబంధం లేకుండా సరైన తేమ వచ్చిన అన్ని కుప్పలను కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు.

అలాగే, కొనుగోలు చేసి సంచులలో నింపిన ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, ఒకవేళ వర్షం వస్తే తడవకుండా చూడాలని ఆదేశించారు. టార్పాలిన్లు, వేయింగ్ మిషన్స్, వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూమెంట్ రిజిస్టర్ ను, ధాన్యం వచ్చిన రిజిస్టర్లను పరిశీలించి, లారీల సమస్య, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. తక్షణమే ఈరోజే 10 లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపించేలా చూడాలని పవర్సరఫరాల డిఎం గోపికృష్ణను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ చర్లపల్లి లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడడమే కాకుండా, సరైన తేమ రావాలంటే ధాన్యాన్ని రాశులుగా పోయకుండా విప్పదీసి ఆరబెట్టాలని చెప్పారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మండలం దండెం పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం తేమ, నాణ్యత, తదితర వివరాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, డిఎస్ఓ వెంకటేష్, పౌరసరఫరాల డీఎం గోపికృష్ణ, తహసిల్దార్ పరశురామ్ లతోపాటు తదితరులు ఉన్నారు.

