జీవితమంతా అదే దారి
- మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
కమలాపూర్, ఆంధ్రప్రభ : రాజకీయ కండువా వేసుకున్నకానుంచే నా జీవితమంతా కొట్లాటమయమైందని మాజీ మంత్రి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు. ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన పలువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశానని, కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్(Uppal Railway Station)లో ఆనాడు చేపట్టిన రైలు రోకో కార్యక్రమం ఢిల్లీని కుదిపించిందని గుర్తుచేశారు. తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ గడ్డను ఉద్యమాలకు అడ్డగా మార్చానని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి హుజరాబాద్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధిని సాధించానని ప్రజలకు గుర్తు చేశారు.
రానున్న 25 సంవత్సరాలకు సరిపోను అభివృద్ధిని కేవలం 10 సంవత్సరాలలో పూర్తి చేశానని, నేను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టసుఖాలను పంచుకుంటూ ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తినని అన్నారు. 2021లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నన్ను వెలివేస్తే హుజురాబాద్ ప్రజల మద్దతుతో ఉప ఎన్నికల్లో గెలిచి కేసీఆర్(KCR)తో కొట్లాట పెట్టుకున్నానని తెలిపారు.
రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ ల పదవులను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కట్టబెడితే అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుందని, డ్రామా కంపెనీలకు, పైసలు ఖర్చు చేసే పార్టీలకు మద్దతు ఇవ్వకుండా ప్రజల పక్షాన కొట్లాడే బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది బండి కళాధర్, పల్లె వెంకట్ రెడ్డి, పబ్బు సతీష్, కనుకుంట్ల అరవింద్, తుమ్మ శోభన్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

