బండి సంజయ్ మీటింగ్‌కు అనుమతి రద్దు
పోలీసుల నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొనే ఎన్నికల సమావేశానికి పోలీసులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశం అకస్మాత్తుగా నిలిపివేయడం బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం రేపింది.
పోలీసుల తీరుపై బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు (BJP election in-charge Dharma Rao) మండిపడ్డారు. అనుమతి ఇచ్చి తర్వాత వెనక్కు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని ఆరోపించారు. బోరబండలోనే సభ నిర్వహిస్తామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు.
బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో సభా స్థలానికి తరలిరావాలని పిలుపునిచ్చిన ధర్మారావు, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన పేర్కొన్నారు.

