తాండూరు వాసుల దుర్మరణం దురదృష్టకరం
- మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం
- మూడు నెలల్లో తాండూరు వికారాబాద్ రోడ్డు పనులు
- ఆర్టీసీ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో తాండూరు వాసులు దుర్మరణం చెందడం దురదృష్టకరం అని, మృతి చెందిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(Buyyani Manohar Reddy) అన్నారు. రోడ్డు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 13 మంది మృతి చెందగా.. ప్రభుత్వం తరుపున రూ. 5లక్షలు, ఆర్టీసీ సంస్థ తరుపున రూ. 2 లక్షలు మొత్తం రూ. 7లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్(Uma Shankar Prasad), ఆర్టీసీ అధికారులతో కలిసి పరిహారం చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా, ఖాలిద్, రెండు నెలల చిన్నారి. విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, వాల్మీకీనగర్ కు చెందిన వెంకటమ్మ, పాత తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్(Laxminarayanpur)కు చెందిన అఖిల రెడ్డి, హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందెప్ప, పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూషా, సాయిప్రియ, నందిని కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిహారం చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలను అండగా నిలించేందుకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరుపున ఇంకా అందాల్సిన వాటిని కూడా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆర్టీసీ దుర్ఘటన(RTC Durghatana)పై ప్రభుత్వం అధికారిక విచారణ ముమ్మరం చేసిందని అన్నారు.

మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. వచ్చే మూడు నెలల్లో తాండూరు –వికారాబాద్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీప్యూటీ డీఆర్ఎం సరస్వతి(DRM Saraswati), కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మసూద్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బోయరవి, తదితరులు ఉన్నారు.


