కట్ట కుంగుతోంది..

కట్ట కుంగుతోంది..

అధికారులు జర దేఖో..!
మోత్కూర్, (ఆంధ్రప్రభ) :
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని మోత్కూర్- తిరుమలగిరి ప్రధాన రహదారిలో మినీ ట్యాంక్ బండ్ చెరువు కట్ట వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో చెరువు కట్ట ఒకవైపు పూర్తిగా కుంగింది .దసరా పండుగ ముందు ఇరిగేషన్ అధికారులు కట్ట కుంగిన ప్రదేశాల్లో తాత్కాలికంగా మట్టి పోసి రోలింగ్ చేసినప్పటికీ యధా ప్రభ… తథా రాజా అన్న చందంగా మారింది. నిత్యం కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి కాస్త కుంగి పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడి ప్రమాదక‌రంగా మారింది. నీటిపారుదల శాఖ ఎస్ ఈ, డీఈ,ఏ ఈ లు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేయాలంటే చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేయాలని తేల్చి చెప్పారు. తాత్కాలిక మరమ్మతులతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. మోత్కూర్ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో ఈ చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపడతారా..? లేదా తాత్కాలిక మరమ్మతులతోనే అధికారులు పబ్బం గడుపుతారా అర్థం కావడం లేదు.

దసరా, దీపావళి పండుగల వేళ బస్సుల రద్దీతో పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది కాపలాగా ఉండి ఈ రూట్లో వచ్చే వందలాది ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను పాటిమట్ల, అనాజీపురం మీదుగా అటు హైదరాబాద్ కి, ఇటు మోత్కూర్, తిరుమలగిరిలకు దారి మళ్లించారు. కేవలం అధికారులు క్షేత్రస్థాయి పరీశీలనతోనే సరి పుచ్చుతారా.. మరమ్మతులు ఎలా మరి అని మున్సిపల్ ప్రజలు వాపోతున్నారు. ఇటీవల భువనగిరి ఆర్‌డీఓ కృష్ణారెడ్డి సైతం ఈ కుంగిన రోడ్డు ని పరిశీలించారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈ ఎన్ సి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి కుంగిన చెరువు కట్టకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టి, ప్రమాదాలను నివారించాలని ఆయకట్టు రైతులతో పాటు మున్సిపల్ ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply