రైతుల కళ్ళలో వెలుగులు నింపడమే ప్రభుత్వ సంకల్పం

రైతుల కళ్ళలో వెలుగులు నింపడమే ప్రభుత్వ సంకల్పం

  • ఎత్తిపోతల పథకాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లేకున్నా, అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదు
  • రాష్ట్ర నీటిపారుదల ఫౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : రైతుల కళ్ళలో వెలుగులు నింపడంతో పాటు హుజూర్‌నగర్(Huzurnagar) కోదాడ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల ఫౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో హుజూర్‌నగర్ కోదాడ నియోజకవర్గాలలో నూతనంగా చేపడుతున్న ఎత్తిపోతల నిర్మాణ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో నాణ్యత లోపించిందని తేలితే సహించేది లేదని ఇరిగేషన్ అధికారులకు, ఏజెన్సీ లకు అల్టిమేటం జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, పనులలో నాణ్యతా లోపించిందని తెలిస్తే ఉపేక్షించేది లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో నిర్దేశిత ఆయకట్టు కలుపుకుని సాగులో లేని భూములు సేద్యంలోకి వస్తాయన్నారు. మైనర్ మార్పులతో ఆదనపు ఆయకట్టు సేద్యంలో(ayacut cultivation)కి వచ్చేందుకు అయ్యే అదనపు నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణాల నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ చేపట్టి రైతులకు నగదు చెల్లింపులు జరిపిన భూములను సత్వరమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పంటకు పంటకు మధ్యలో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

ఎత్తిపోతల పథకాల(lift irrigation schemes) నిర్మాణాల పై ఆయకట్టు రైతాంగం పెంచుకున్న ఆశలు అమలులోకి రావాలి అంటే నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడమేనన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పధకంతో పాటు జవహర్ జానపహాడ్ బ్రాంచ్ కెనాల్, బెట్టేతండా, నక్కగూడెం, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాల పురోగతితో పాటు, హుజూర్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన పురోగతి, కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్(Rajiv Shantinagar), ఆర్-9, మోతే ఎత్తిపోతల పథకాలతో పాటు కోదాడలో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖా కార్యాలయ భవన నిర్మాణ పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఈ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ముక్య నాయకులు, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply