Celebration | పెళ్లి వేడుకలలో ఉంగరాలు మార్చుకున్న కెసిఆర్ దంపతులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నేడు జరిగిన దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుని రిసెప్షన్‌కు హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి శోభ అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
ఈ వివాహ వేడుకలో మాజీ సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. .ఇదే వేడుకలో ఓ అపురూప ఘటన చోటుచేసుకుంది. ఇదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో పెళ్లి వేదిక వద్ద అతిథులు ప్రత్యేకంగా వేడుకను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వధూవరులు, ఇతర అతిథుల సమక్షంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని మధురమైన క్షణాలను ఆస్వాదించారు.
వివాహానికి విచ్చేసిన అతిథులు, కుటుంబసభ్యులు ఈ అందమైన ఘట్టాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఈ సంఘటన పెళ్లి వేడుకలో మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
ప్రముఖ నేతగా కాకుండా మంచి మనుసుతో, సింపుల్‌గా ప్రజల మధ్య మెలిగే వ్యక్తిగా కేసీఆర్ ఈ సందర్భంలో కనిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ దంపతుల ఈ అపురూప క్షణాలను చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు కూడా ట్వీట్టర్ ద్వారా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టులు పెట్టి విషెస్ తెలియజేశారు.