Review Meeting సింగరేణి ఉన్నతి కోసం కృషి చేసేవాళ్లకే ప్రాధాన్యం – అధికారులతో సిఎండి బలరామ్ స్పష్టం

సింగరేణి ఉన్నతి కి అహర్నిశలు కృషి చేసే వాళ్లకే కంపెనీలో చోటు
ప్రతీ విభాగం అధిపతి రానున్న పదేళ్ల కోసం భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలి
లక్ష్యాల సాధన లో ఉద్యోగులను భాగస్వాములను చేయాలి
క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఏరియా జీఎంలు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఏజెంట్లతో ముఖాముఖి సమీక్షలో
సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టీకరణ

హైదరాబాద్ ,ఆంధ్రప్రభ – సింగరేణి కాలరీస్ సుస్థిర భవిష్యత్తే ప్రతీ ఒక్క అధికారి, ఉద్యోగికి ప్రథమ కర్తవ్యం కావాలని.. ఇందుకోసం అందరూ తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని.. అలసత్వం ప్రదర్శించే వాళ్లకు కంపెనీలో స్థానం ఉండదని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి వీలుగా సంస్థ భవిష్యత్ కోసం వచ్చే పదేళ్లకు అవసరమైన ప్రణాళికలను ప్రతీ విభాగం అధిపతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. సింగరేణిలో పని చేస్తున్న అందరికీ కంపెనీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పునరుద్ఘాటించారు.


సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల జీఎంలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా సింగరేణి భవన్ లో నేడు ఒక్కొక్క ఏరియా జీఎంతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయా ఏరియాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు.. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకొని.. రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు. రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలన్నారు. అలాగే 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టం చేశారు. బొగ్గు ఉత్పత్తిలో రక్షణ, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో రవాణా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బొగ్గు రవాణా సాఫీగా జరిగేలా రైల్వే, వినియోగదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలన్నారు. నూతన గనుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కార్పోరేట్ జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు.


ఇటీవల తాను బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోని 20 గనుల్లో చేపట్టిన పర్యటనలో కార్మికుల నుంచి తెలుసుకున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల్లో నైపుణ్యాల పెంపుదల, గనుల్లో మ్యాన్ రైడింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అన్ని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.


సంస్థ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్పోరేట్ జీఎంలు తోడ్పాటు అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, నాణ్యత పెంపుదలతోపాటు, భూ గర్భ గనులకు సంబంధించి టబ్బులను అందుబాటులో ఉంచేలా చూడటం, ప్రాసెస్డ్ ఓవర్ బర్డెన్ నిల్వలను ఉంచుకోవడం, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, గైర్హాజరీలను నివారించేలా కౌన్సిలింగ్ నిర్వహించడం తదితర అన్ని చర్యలను చేపట్టడం ద్వారా ఉత్పత్తికి దోహదపడవచ్చన్నారు.


ప్రతీ ఉద్యోగి, అధికారి ఒక జట్టుగా పనిచేస్తూ సంస్థ ను అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. ఉద్యోగులు, అధికారులు ప్రతీ ఒక్కరూ రోజుకు 8 గంటల పాటు కచ్చితంగా పనిచేస్తూ బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. మస్టర్ పడి బయటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో వచ్చేలా చూడాలని, గ్రేస్ టైమ్ వరకు మస్టర్ నమోదుకు అనుమతించొద్దన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ పనిచేస్తున్నామా? లేదా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు.


సమావేశంలో డైరెక్టర్లు శ్రీ డి.సత్యనారాయణ(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), శ్రీ కె.వేంకటేశ్వర్లు ( పీ అండ్ పీ), అడ్వైజర్(ఫారెస్ట్రీ) మోహన్ పర్గేన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్ డీ ఎం. సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) డి.రవి ప్రసాద్, అన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *