హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటేసి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “నవీన్ యాదవ్ గల్లీలో తిరిగిన పేదోళ్ల బిడ్డ. సానుభూతి లేదా సెంటిమెంట్‌లను పక్కన పెట్టి, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి” అని ఓటర్లను కోరారు.
రహమత్‌నగర్‌లో రోడ్‌షో, వెంగళరావు నగర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తూ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. బీఆర్‌ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్‌ను మూడుసార్లు గెలిపించినా, నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముగ్గురు మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి వందల కోట్లు విలువైన పనులు ప్రారంభించాం,” అని వివరించారు.
“రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. కష్టపడే వారిని గెలిపించకపోతే, అది చారిత్రక తప్పు అవుతుంది” అని ఆయన హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ నేతలు ‘బిల్లా-రంగాలు’ సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శిస్తూ, వారికి సెంటిమెంట్‌పై మాట్లాడే హక్కు లేదన్నారు. “కంటోన్మెంట్‌లో కూడా సెంటిమెంట్ చెప్పినా ప్రజలు అభివృద్ధికే ఓటేశారు. ఇప్పుడు అక్కడ రూ.4 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి,” అని ఉదాహరణ ఇచ్చారు.
“మీరు మూడుసార్లు గెలిపించిన ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాడా? మీ పిల్లలు బడికి వెళ్తున్నారా, మీరు బాగున్నారా అని అడిగాడా?” అని ప్రజలను ప్రశ్నించారు. “బీఆర్‌ఎస్ నేతలు ఓట్లు అడగడానికి వస్తే సలాకి పెట్టి కాల్చండి” అని మహిళా ఓటర్లను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.
“జూబ్లీహిల్స్ ప్రపంచానికి తెలిసిన ప్రాంతం. కానీ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే, ఆయన మీ గొంతుకగా అసెంబ్లీలో నిలుస్తారు,” అని తెలిపారు.

